మోటకొండూర్, అక్టోబర్ 17 : గ్రామాల్లో శాంతి భద్రతలను పటిష్ఠం చేసేందుకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగ పడుతాయని యాదగిరిగుట్ట రూరల్ సీఐ శంకర్ గౌడ్ అన్నారు. మోటకొండూర్ మండలంలోని ఇక్కుర్తి గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుపై మోటకొండూర్ ఎస్ఐ అశోక్ ఆధ్వర్యంలో శుక్రవారం గ్రామస్తులకు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ శంకర్ గౌడ్ మాట్లాడుతూ.. గ్రామాల్లో సీసీ కెమెరాలు ఉంటే నేరాలను సులభంగా నియంత్రించవచ్చునన్నారు. అంతేకాకుండా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందే నిరోధించవచ్చునన్నారు. ఒకవేళ నేరం జరిగినా, రికార్డుల సహాయంతో నిందితులను వెంటనే గుర్తించడం చాలా సులభమవుతుందని తెలిపారు. ప్రతి గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలు సహకరించి, ఆర్థిక సాయాన్ని అందించాలని కోరారు. ఈ సమావేశంలో గ్రామ పెద్దలు, ప్రజా ప్రతినిధులు, ఆయా కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.