బీబీనగర్, ఆగస్టు 20 : వరంగల్‌లోని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) పీఐయూ ప్రాజెక్ట్ డైరెక్టర్ దుర్గాప్రసాద్ ఓ ప్రైవేట్ వ్యక్తి నుండి రూ. 60 వేల లంచం తీసుకుంటుండగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) అధికారులు మంగళవారం అరెస్ట్ చేశారు. బీబీనగర్‌లోని గూడూరు టోల్ ప్లాజా సమీపంలో హైదరాబాద్-వరంగల్ హైవేకు ఆనుకుని ఉన్న రెస్టారెంట్ నిర్వహణకు తన ఐదేండ్ల పదవీ కాలంలో ఎటువంటి ఆటంకం కలిగించకుండా ఉండటానికి నిర్వాహకుడి నుండి ప్రాజెక్ట్ డైరెక్టర్ రూ.లక్ష డిమాండ్ చేశాడు. బేరసారాల తర్వాత ప్రాజెక్ట్ డైరెక్టర్ రూ.60 వేలు స్వీకరించడానికి అంగీకరించాడు. దీంతో బాధితుడు సీబీఐని ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు.
మంగళవారం నాడు ప్రాజెక్ట్ డైరెక్టర్ ఓ ప్రైవేట్ వ్యక్తి నుండి రూ.60 వేలు లంచం స్వీకరిస్తుండగా సీబీఐ ఇద్దరినీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. నిందితులిద్దరినీ అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. హైదరాబాద్, వరంగల్, సదాశివపేట్లలో ఎన్హెచ్ఏఐ కార్యాలయాలలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. బుధవారం ఉదయం 7 గంటల సమయంలో గూడూరు టోల్ ప్లాజాకు చేరుకున్న సీబీఐ అధికారులు దుర్గాప్రసాద్ టోల్‌ప్లాజా లోకి వచ్చిన తేదీలు, ఎక్కడకు వెళ్లారనే సీసీ టీవి ఫుటేజ్‌ను పరీశీలించారు.