భూదాన్ పోచంపల్లి, జూలై 29 : భూ సేకరణను తొందరగా చేపట్టి, బునాదిగాని కాల్వ పనులను పూర్తి చేయాలని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండల కేంద్రంలోని బాలాజీ ఫంక్షన్ హాల్లో రాష్ట్ర షెడ్యూల్ కులాల, తెగల, మైనార్టీ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డితో కలిసి లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. భూ సేకరణకు ఖర్చు ఎంతైనా ఇరిగేషన్ శాఖ నుంచి నిధులను విడుదల చేస్తామని తెలిపారు. బునాదిగాని కాల్వ, ధర్మారెడ్డిపల్లి, పిలాయిపల్లి కాల్వ పనులను ఆధునీకరించినందుకు నిధులను మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. ఆలేరులో గంధమల్ల ప్రాజెక్టుకు రూ.500 కోట్లతో శంకుస్థాపన చేసినట్లు ఈ సందర్భంగా తెలిపారు.
మంత్రి అడ్లురి లక్ష్మణ్ మాట్లాడుతూ.. ప్రజా పాలనలో ప్రజలందరికీ మేలు జరుగుతుందన్నారు. రాజకీయాలకు అతీతంగా రేషన్ కార్డులు, ప్రతి ఒక్కరికి సన్న బియ్యం అందిస్తున్నట్లు తెలిపారు. భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అలీనగర్ ఫీడర్ ఛానల్‌కు నిధులు కేటాయించాలని ఈ సందర్భంగా మంత్రిని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు, సివిల్ సప్లై ముఖ్య కార్యదర్శి డిఎస్ చౌహన్, అడిషనల్ కలెక్టర్ భాస్కరరావు, చౌటుప్పల్ ఆర్డీఓ శేఖర్ రెడ్డి, తాసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు పాక మల్లేశ్ యాదవ్, పట్టణ అధ్యక్షుడు భారత లవ కుమార్, నాయకులు తడక వెంకటేశ్, కళ్లెం రాఘవరెడ్డి, సామ మోహన్ రెడ్డి, మరి నర్సింహారెడ్డి, తడక రమేశ్, నాయకులు కొట్టం కరుణాకర్ రెడ్డి, కాసుల అంజయ్య, మన్నెం వెంకట్ రెడ్డి, ఫకీరు నర్సిరెడ్డి, సుర్వి వెంకటేశ్, అంజిరెడ్డి, లాలయ్య, మెరుగు శశికళ పాల్గొన్నారు.