బీబీనగర్, నవంబర్ 03 : ఫీజు రియింబర్స్‌మెంట్ బకాయిలను చెల్లించాలని ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు చేపడుతున్న నిరవధిక బంద్‌కు బీఆర్ఎస్వీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని బీఆర్ఎస్వీ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కి నగేశ్ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం సుమారు 15 లక్షల మంది విద్యార్థులకు రూ.8,500 కోట్ల ఫీజు రియింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయక పోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఆందోళన చెందుతున్నారన్నారు. ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. గ్రీన్ ఛానల్ ద్వారా బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చి విద్యార్థులను మోసం చేస్తున్నట్లు దుయ్యబట్టారు.
రియింబర్స్‌మెంట్ నిధులు అందక విద్యార్థులు టీసీలు, సర్టిఫికెట్లు పొందడానికి ఆస్తులు తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకోవాల్సి వస్తోందని ఆవేదక వ్యక్తం చేశారు. విద్యా సంస్థల యాజమాన్యాలు కళాశాలలను నడపలేక ఫైనాన్స్ తీసుకుని ఉద్యోగులకు జీతాలు చెల్లించే పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న 1.5 లక్షల మంది సిబ్బంది ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే ఫీజు రియింబర్స్‌మెంట్ నిధులను విడుదల చేయాలని బీఆర్ఎస్వీ డిమాండ్ చేస్తుందన్నారు.