రాజాపేట, ఏప్రిల్ 24 : హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభ కుంభమేళాను తలపించి చరిత్రలో నిలిచిపోనుందని డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి అన్నారు. గురువారం రాజాపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ 15 నెలల పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందని, సీఎం రేవంత్ రెడ్డి ప్రజల్లో అభాసుపాలవుతున్నాడని విమర్శించారు. వానాకాలం రైతు బంధు ఎగ్గొట్టి, యాసంగి కోతలు షురూ అయినప్పటికీ ఇవ్వకుండా రైతులకు మాయమాటలు చెబుతూ మోసం చేస్తున్నాడన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలు ఊసే లేదన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు రూ.2,500, కల్యాణలక్ష్మి, రైతు భరోసా, రైతు రుణమాఫీ అందించడంలో పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. రాష్ట్రంలో ప్రజా పాలన కొనసాగిస్తున్నామని చెప్పుకుంటూ నిర్బంధ పాలన కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. పోలీసులు అరాచకాలు సృష్టిస్తూ అధికార పార్టీకి ఏజెంట్లుగా మారిపోయారని విమర్శించారు. పోలీస్ స్టేషన్లు కాంగ్రెస్ కార్యాలయాలుగా మారిపోయాయని, అధికార పార్టీ నాయకులకు అడుగులకు మడుగులోత్తుతూ బీఆర్ఎస్ పార్టీ నాయకులపై కేసులు నమోదు చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. యాదగిరిగుట్ట ఏసీపీ స్థానిక ఎమ్మెల్యేకు గన్మెన్గా వ్యవహరిస్తున్నాడని, రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలని హితవు పలికారు. అధికారం ఎప్పటికీ ఎవ్వరికి శాశ్వతం కాదన్నారు.
కేసీఆర్ అంటేనే ప్రజలకు భరోసా అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామరక్షగా నిలుస్తారన్నారు. రాష్ట్ర ప్రజలు మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నట్లు తెలిపారు. రజతోత్సవ సభలో కేసీఆర్ ఏమి మాట్లాడతారోనని ప్రజల్లో విపరీతంగా చర్చ కొనసాగుతుందని, ఆయన ప్రసంగం వినేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. రజతోత్సవ సభకు దండుగా తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సట్టు తిరుమలేశ్, మాజీ జడ్పిటిసీ చామకూర గోపాల్ గౌడ్, నాయకులు గుంటి కృష్ణ, సంధిల భాస్కర్ గౌడ్, రామిండ్ల నరేందర్, బెడద వీరేశం, కటకం స్వామి, ఠాకూర్ ధర్మేందర్ సింగ్, రాంరెడ్డి చెరుకు కనకయ్య, ఉప్పలయ్య గౌడ్, లక్ష్మణ్ నాయక్, ఉప్పలయ్య, అశోక్, పాండరీ పాల్గొన్నారు.