భూదాన్ పోచంపల్లి, ఆగస్టు 19: భూదాన్ పోచంపల్లి (Pochampally) పట్టణ కేంద్రంలోని 13వ వార్డు (సరస్వతి విద్యా మందిర్కు వెళ్లే) రహదారిలో వర్షపు నీరు నిల్వ ఉండడంతో బీఆర్ఎస్ యూత్ నాయకుడు చింతకింది కిరణ్ వర్షపు నీటిలో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డుపై వర్షం నీరు కుంటలా తలపిస్తుందని విమర్శించారు. వర్షపు నీరు నిలువకుండా సమస్యను పరిష్కరించాలని గత రెండేండ్ల నుంచి మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని ఆరోపించారు.
ఈ రహదారి గుండా ప్రతినిత్యం స్కూల్ విద్యార్థులు, వార్డు ప్రజలు వెళ్తుంటారని, నీరు నిల్వ ఉండడంతో ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులు సమస్యను పరిష్కరించకపోతే పురపాలక కార్యాలయం ఎదుట ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఆయనతోపాటు నాయకులు వనం భాస్కర్, వంగూరి వరమ్మ, రామకృష్ణ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.