యాదగిరిగుట్ట, జూన్25: రైతుకు రావాల్సిన పెట్టుబడి సాయం ఎగ్గొట్టినందుకే కాంగ్రెస్ ప్రభుత్వం విజయోత్సవ సభను నిర్వహిస్తున్నట్లుగా ఉందని బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య, నార్మూల్ మాజీ చైర్మన్ లింగాల శ్రీకర్ రెడ్డి మండిపడ్డారు. ఈ సందర్భంగా వారు యాదగిరిగుట్ట పట్టణంలో మీడియాతో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 2,84,250 మంది రైతులుంటే కేవలం 2,27,544 మందికి మాత్రమే నగదు జమ అయ్యిందని, పలువురు రైతులకు ఉన్న భూములకు విస్తీర్ణానికి అనుగుణంగా వానాకాలం సీజన్ డబ్బులు జమ కాలేదన్నారు. రైతు భరోసా అందక చాలా మంది రైతులు ఆయోమయానికి గురువుతున్నారని తెలిపారు.
గత రెండేళ్లుగా రైతు భరోసాను నిలిపివేసి స్థానిక సంస్థల ఎన్నికల వస్తాయని భయంతో భరోసాను ఇచ్చేందుకు తెర తీశారని విమర్శించారు. 6 గ్యారెంటీలు, 420 హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందన్నారు. మహిళలకు తులం బంగారం, రూ.2500 భృతి, విద్యార్థినులకు స్కూటీలు ఇస్తానని చెప్పిన కాంగ్రెస్ వాటికి ఎగనామం పెట్టి సిగ్గులేకుండా విజయోత్సవ సభను ఏర్పాటు చేస్తున్నదని అన్నారు. రైతులకు ఏం చేశావని సంబురాలు జరుపుతున్నావో ప్రజలకు వివరించాలన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులందరికీ సకాలం పెట్టుబడి సాయం అందేదని తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ది చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ గ్యాదపాక నాగరాజు, పీఏసీఎస్ డైరక్టర్ బీస కృష్ణం రాజుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.