రాజాపేట, జులై 07 : రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా బోగస్ ఓట్లను గుర్తించి తొలగించాలని రాజాపేట తాసీల్దార్ అనిత బీఎల్ఓలకు సూచించారు. సోమవారం మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్లో ఏర్పాటు చేసిన బూత్ స్థాయి అధికారుల శిక్షణా కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడారు. అర్హత ఉండి, స్థానికంగా నివాసం ఉండే ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆడపిల్లల తల్లిదండ్రులు తమ పిల్లలకు ఓటు హక్కు నమోదు చేయించడంలో నిర్లక్ష్యంగా ఉంటున్నారని, అలాంటి వారికి ఓటు హక్కుపై అవగాహన కల్పించి జాబితాలో నమోదు చేసుకునే విధంగా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసీల్దార్ అశోక్, వెంకటేశ్వరరెడ్డి, మాస్టర్ ట్రైనర్స్ హరనాథ్ రెడ్డి, దూడల వెంకటేశ్, రాజు, దినేశ్, ఉమాశేఖర్, ఉదయకుమార్ పాల్గొన్నారు.