బీబీనగర్, జూలై 23 : ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ రాజీనామాపై బీజేపీ ప్రభుత్వం వివరణ ఇవ్వాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. బుధవారం బీబీనగర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉప రాష్ట్రపతి రాజీనామా పార్లమెంట్లో తీవ్ర చర్చకు దారితీస్తుందన్నారు. భారీగా నోట్ల కట్టలతో పట్టుబడిన కేసులో విచారణ ఎదుర్కొంటున్న హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మపై వ్యవహరించిన తీరు, కశ్మీర్ పహల్గాం వైఫల్యంపై ప్రతిపక్ష నాయకుడికి ఎక్కువ సమయం ఇచ్చిన నేపథ్యంలో రాజీనామా జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయన్నారు. దీనిపై బీజేపీ సమగ్ర వివరణ ఇవ్వాల్సిందేనని అన్నారు. ఎన్నికల కమిషన్ ఒక అడుగు ముందుకు వేసి భారత పౌరసత్వాన్ని నిర్ణయించే విషయంలో ప్రవేశిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ చొరబాటు దారుల పేరుతో మైనార్టీల ఓట్లు తగ్గించడానికి కుట్రలు పన్నుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఆగస్టు 8న దేశవ్యాప్తంగా నిరసన తెలుపనున్నట్లు చెప్పారు.
ఎన్నికల కమిషన్ అప్రజాస్వామ్యిక విధానాలపై మండల స్థాయి నుండి రాష్ట్రస్థాయి వరకు నిరసన తెలుపుతామన్నారు. రాష్ట్ర శాసనసభ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ రాష్ట్రపతికి పంపించి మూడు నెలలు దాటుతున్నా నేటికీ ఆ విషయంపై ఆమోదం తెలపలేదని, కనీసం బీజేపీ తన వివరణ ఇవ్వలేదన్నారు. రాష్ట్రంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు అమలు కాకుండా కేంద్రం పని చేస్తుందన్నారు. బీబీనగర్ ఎయిమ్స్‌లో నేటికీ వైద్యం సరిగ్గా అందడం లేదన్నారు. మూసీ కాలుష్యంతో ఇక్కడి మహిళలకు గర్భస్రావాలు, ప్రజలకు చర్మ వ్యాధులు, ఇతర అనేక వ్యాధులకు ప్రజలు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మూసి ప్రాజెక్టు కోసం నిధులు వెంటనే కేటాయించాలని డిమాండ్ చేశారు.
ప్రైవేట్ విద్యాలయాలు, కార్పొరేట్ విద్యాలయాల్లో ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తూ దోపిడీకి చేస్తున్న విషయంపై విద్యార్థి సంఘాలు చేస్తున్న పోరాటాలకు సీపీఎం మద్దతు ఉంటుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 18 నెలలు గడుస్తున్నా నేటికీ జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించలేదన్నారు. ఆర్టీజెన్సీ కింద పనిచేస్తున్న విద్యుత్ కార్మికులకు పర్మినెంట్ చేయడం లేదని పేర్కొన్నారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండి జహంగీర్, రాష్ట్ర కమిటీ సభ్యుడు కొండమడుగు నరసింహ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు జెల్లెల పెంటయ్య, కోమటిరెడ్డి చంద్రారెడ్డి, బొల్లు యాదగిరి, గంగాదేవి సైదులు, గడ్డం వెంకటేశ్, మండల కార్యదర్శి గాడి శ్రీనివాస్ పాల్గొన్నారు.