బీబీనగర్, మే 12 : బాలికపై అత్యాచారం జరిగిందంటూ నమోదైన కేసులో నిందితుడైన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్‌పై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ రాష్ర్ట నాయకురాలు గాదె కవిత, మాజీ సర్పంచ్ మల్లగారి భాగ్యలక్ష్మి డిమాండ్ చేశారు. మంగళవారం బీబీనగర్ మండల కేంత్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఎంతసేపు బీఆర్ఎస్ బీజేపీలు రెండూ ఒకటే అని విమర్శించే నాయకులు ఎక్కడకు పోయారని, బిజెపి నాయకుడి కొడుకు తప్పు చేస్తే పట్టుకుని శిక్షించాల్సింది పోయి వారికి వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. ఘటన జరిగినప్పటి నుంచి ఇప్పటివరకు నిందితుడిపై చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో పోలీసులు ఆలస్యం చేస్తున్నారని ఆరోపించారు. మైనర్ బాలిక ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేసినప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. రాష్ర్టంలో మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారిందని, రాష్ట్ర హోంశాఖ బాధ్యతలు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వద్దే ఉన్నప్పటికీ న్యాయం జరగడం లేదన్నారు. మాజీ సర్పంచ్ మల్లగారి భాగ్యలక్ష్మి మాట్లాడుతూ, సాధారణ వ్యక్తులపై కేసులు నమోదైతే వెంటనే చర్యలు తీసుకునే పోలీసులు, రాజకీయ నాయకుల కుటుంబ సభ్యుల విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, భగీరథ్‌ను వెంటనే అరెస్ట్ చేసి విచారణ వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు.
ఎంతసేపు బిఆర్ఎస్ బిజేపి పార్టీలు రెండూ ఒకటే అని విమర్శించే నాయకులు ఎక్కడకు పోయారని బిజెపి నాయకుడి కొడుకు తప్పు చేస్తే పట్టుకుని శిక్షించాల్సింది పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వారికి వత్తాసు పలుకుతుందని ఆరోపించారు. బిజెపి కాంగ్రెస్ పార్టీలు రెండూ ఒకటే అని అన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే మహిళలతో కలిసి ఆందోళనలు, ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు రాచమల్ల శ్రీనివాసులు, రాష్ర్ట నాయకుడు గాదే నరేందర్ రెడ్డి, సోమారపు శంకర్ పాల్గొన్నారు.