మోటకొండూర్, అక్టోబర్ 18 : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు పార్లమెంట్లో ఆమోదం తెలుపాలని మోటకొండూర్ అఖిలపక్ష నేతలు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ శనివారం మోటకొండూర్ మండల కేంద్రంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో బంద్ చేపట్టగా పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నేతలు మాట్లాడుతూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు చట్టబద్ధం చేయడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత అన్నారు. తెలంగాణ అసెంబ్లీలో ఇప్పటికే ఏకగ్రీవంగా తీర్మానం చేసి గవర్నర్, రాష్ట్రపతికి పంపినప్పటికీ కేంద్రం ఇంకా ఆమోదం ఇవ్వకపోవడం దురదృష్టకరమని విమర్శించారు. బీసీలు రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో ఎదగాలంటే రిజర్వేషన్లు తప్పనిసరన్నారు. కేంద్రం మొండి వైఖరి విడిచి బిల్లు పార్లమెంటులో ఆమోదించాలన్నారు.
రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు ఏకాభిప్రాయంతో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు మంజూరు చేయాలని సూచించాయని, గవర్నర్ వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్లు అమలు అయ్యేవరకు తమ పోరాటం కొనసాగుతుందని నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు ఎగ్గిడి కృష్ణ, భాస్కరుని రఘునాథరాజు, భూమండ్ల ఐలయ్య, బొలగాని జయరాములు, బొలగాని సత్యనారాయణ, భూమండ్ల శ్రీనివాస్, గాదేగాని మాణిక్యం, కొల్లూరి ఆంజనేయులు, భూమండ్ల బీరయ్య, భూమండ్ల బాలరాజు, వంగాల మల్లేష్, రేగు రమేష్, భూమండ్ల బంగారి, వివిధ కుల సంఘాల అధ్యక్షులు బాల్ద సిద్ధులు, జంపాల నాగచందర్, ఎత్తరి గణేష్, కొల్లూరు స్వామి, బొట్ల నరసింహ, గిరిబోయిన మల్కయ్య తదితరులు పాల్గొన్నారు.