సిడ్నీ : ఏఎఫ్సీ మహిళల ఆసియాకప్‌లో భారత్ పోరాటం ముగిసింది. టోర్నీలో నిలువాలంటే తప్పక గెలువాల్సిన మ్యాచ్‌లో భారత జట్టు ఆకట్టుకోలేకపోయింది. మంగళవారం జరిగిన తమ ఆఖరి లీగ్ పోరులో భారత్ 1-3 తేడాతో చైనీస్ తైపీ చేతిలో ఓటమిపాలైంది. ప్రతిష్టాత్మక టోర్నీకి తొలిసారి అర్హత సాధించిన మన అమ్మాయిలు స్ఫూర్తిదాయక ప్రదర్శన కొనసాగించడంలో విఫలమయ్యాడు.
చైనీస్ తైపీతో మ్యాచ్‌లో గోల్ చేసేందుకు పలు అవకాశాలు వచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయారు. మ్యాచ్ ఆద్యంతం భారత డిఫెన్స్ లోపాలను ఎత్తిచూపుతూ చైనీస్ తైపీ మూడు గోల్స్‌తో మ్యాచ్‌ను తమ వశం చేసుకుంది. టీమ్ఇండియా తరఫున మనీశా కల్యాణ్(39ని) ఏకైక గోల్ చేయగా, వై హెచ్ సు(12ని), వై వై సు(45ని), యు చిన్ చెన్(77ని) చైనీస్ తైపీకి గోల్స్ అందించారు. మరో పోరులో జపాన్ 4-0తో వియత్నాంపై గెలిచి ముందజం వేసింది.