హైదరాబాద్, మార్చి 10(నమస్తే తెలంగాణ): వచ్చే మూడేండ్లలో రాష్ట్రంలో భవనాలు లేని గ్రామపంచాయతీలు అన్నింటికీ శాశ్వత భవనాలు నిర్మించాలని, ఆ మేరకు పంచాయతీరాజ్‌శాఖ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. అంబేదర్ సచివాలయంలో మంగళవారం ప్రీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మంత్రులు జూపల్లి కృష్ణారావు, సీతక, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, గడ్డం వివేక్లతో కలిసి ఆయా శాఖల సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. స్థలాలు అందుబాటులో ఉన్నచోట తాసిల్దార్ కార్యాలయాలు, ఎంపీడీవో కార్యాలయాలు కలిపి నిర్మించే అవకాశాన్ని పరిశీలించాలని సూచించారు. ఉ పాధి కల్పించే విధంగా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లలో కోర్సులు రూపొందించాలని, గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా ఎంవోయూ కుదుర్చుకున్న కంపెనీలను సంప్రదించాలని సూచించారు.