హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చ్ 10 (నమస్తే తెలంగాణ): ‘మా న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం స్పందించడమే లేదు. మా కోర్కెలను తీర్చే వరకూ పోరుబాట ఆపేది లేదు. ఉద్యమబాటలో భాగంగా ఏప్రిల్ తొలివారంలో నిరవధిక సమ్మెకు వెళ్తాం. ఈ మేరకు అధికారులకు నోటీసులు ఇస్తాం’ అని తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జా యింట్ యాక్షన్ కమిటీ (టీవీఈజేఏసీ) ప్రభుత్వాన్ని హెచ్చరించింది. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ టీవీఈజేఏసీ ఆధ్వర్యంలో విద్యుత్తు కార్మికులు మంగళవారం హైదరాబాద్ మింట్ కాంపౌండ్‌లోని టీజీఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం వద్ద మహాధర్నా నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి నాలుగు విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. ఆర్టిజన్లు, ఇతర విద్యుత్తు కార్మికుల నినాదాలతో మింట్‌కాంపౌండ్ దద్దరిల్లింది. విద్యార్హతలను బట్టి తమకు వెంటనే కన్వర్షన్ ఇవ్వాలంటూ రెండేండ్లుగా అడుగుతున్నా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, మరోవైపు స్టాండింగ్ ఆర్డర్‌ను ఇప్పటివరకు అమల్లోకి తీసుకురాలేదంటూ టీవీఈజేఏసీ నాయకులు ఆందోళన చేశారు.
అనేకమంది ఆర్టిజన్లు ప్రమాదకరమైన పరిస్థితుల్లో పనిచేస్తున్నా తమకు విద్యుత్తు సంస్థల్లో ఉద్యోగుల మాదిరిగా జీతభత్యాలు, ఇతర సదుపాయాలు కానీ కల్పించడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఎన్నికల ముందు తమ డిమాండ్లను పరిష్కరిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చి, ఇప్పుడు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. డిప్యూ టీ సీఎం భట్టివిక్రమార్క గతంలో ప్రతిపక్ష నాయకుడుగా అసెంబ్లీలో తమ సమస్యలపై మాట్లాడి, ఇప్పుడేమో ఆర్టిజన్లు ఎవరు? అంటూ ప్రశ్నిస్తున్నారని తెలిపారు. అధికారం లో ఉంటే ఒకలా? లేకుంటే మరోలా? మాట్లాడటం సమంజసమా? అని ప్రశ్నించారు. సం స్థ సీఎండీ జితేశ్ వీ పాటిల్‌ను జేఏసీ నేతలు కలిసే ప్రయత్నం చేసినా.. ఆయన అందుబాటులో లేరని అవకాశం ఇవ్వలేదని తెలిపారు. ధర్నాలో జేఏసీ చైర్మన్ ఎస్ సతీశ్‌రెడ్డి, కన్వీనర్ సాయిలు, చంద్రారెడ్డి, కో చైర్మన్ శ్రీధర్‌గౌడ్, చందర్‌సింగ్ , సంతోష్ పాల్గొన్నారు.