భువనగిరి అర్బన్: బాలల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 24న బాల అదాలత్ నిర్వహిస్తామని ఈ కార్యక్రమంలో బాలల సమస్యలను దరఖాస్తు రూపంలో సమావేశం దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు బండి అపర్ణ అన్నారు. ఈనెల 24న నిర్వహించబోయే బాల-అదాలత్ కార్యాక్రమ సన్నాహక సమావేశం మంగళవారం పట్టణంలోని మున్సిపల్ కార్యాల య సమావేశం హాల్లో నిర్వహించి సబంధిత వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలల హక్కులను కాపాడుటకు, బాలలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను పరిష్కరించడానికి బాల అదాలత్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బాల కార్మికులు, ఆక్రమ దత్తత, బడులలో వేదింపులు, వైకల్యంతో భాద పడేవారు, ఇత రత్రా సమస్యలతో బాధ పడుతున్న పిల్లలు బాల అదాలత్‌లో బెంచ్‌కి తమ సమస్యను వివరిస్తూ దరఖాస్తు చేసుకోవాలన్నారు. సమస్యలతో బాధ పడుతున్న పిల్లల యొక్క తల్లిదండ్రులు లేదా సంరక్షకులు బాలలతో కలిసి ఈనెల 24 తేదీన సదరు సర్టిఫికెట్స్‌తో పట్టణంలోని రావి భద్రారెడ్డి ఫంక్షన్హాల్లో ఉదయం 10 గంటల నుంచి సా.4 గంటల వరకు నిర్వహించే కార్యక్రమంలో ఫిర్యాదులు సమర్పించాలన్నారు.
ఏదైనా ఫిర్యాదు కోసం 9666906333 ఫోన్ నంబర్లో, జీ మేయిల్ tscpcrhyd@gmail.com వెబ్ సైట్లో సమాచారం పంపాలని చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ దీపక్‌తివారీ, జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి, జిల్లా బాలల పరిరక్షణ అధికారి సైదులు, సీడబ్ల్యూసీ చైర్పర్సన్ జయశ్రీ, ఆయా శాఖల అధికారులు, సీడీపీవోలు, సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు, ఎన్జీఎ ప్రతినిధులు, జిల్లా బాలల పరిరక్షణ విభాగం అధికారులు పాల్గొన్నారు.