హైదరాబాద్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ) : విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మృతి చెందిన హోంగార్డు కుటుంబానికి రూ.34 లక్షల ప్రమాద బీమా చెక్కును అందించారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో హోంగార్డుగా(నంబర్ 1522) విధులు నిర్వహించిన ఎం వెంకటేశ్ నిరుడు ఏప్రిల్ 27న ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. హోంగార్డు విభాగంతో యాక్సిస్ బ్యాంక్ కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం.. వేతనం అకౌంట్ కలిగిన సిబ్బందికి వర్తించే ప్రమాద బీమా సౌకర్యం కింద రూ.34 లక్షల పరిహారం మంజూరైంది. సదరు చెక్కును సోమవారం డీజీపీ కార్యాలయంలో అడిషనల్ డీజీపీ (హోంగార్డ్స్) స్వాతి లక్రా మృతుడి భార్య కొడిగంటి స్వాతికి అందజేశారు. కార్యక్రమంలో యాక్సిస్ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్ రవీందర్రెడ్డి, హోంగార్డ్ రీజియన్ కమాండెంట్ వెంకటేశ్వర్లు, ఏవో సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.