ఆలేరు టౌన్, మార్చి 18: శాంతియుతంగా అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని బీఆర్ఎస్ యూత్ నాయకులు చేపడితే ఆలేరు పోలీసులు ముందస్తు అరెస్టు చేయడం అప్రజాస్వామికమని బీఆర్ఎస్ యూత్ నాయకులు అన్నారు. ఆలేరు పట్టణ కేంద్రంలోని బీఆర్ఎస్ యూత్ నాయకులను పక్కలో నుండి నిద్ర లేవక ముందే వారి ఇళ్లలోకి వెళ్లి ముందస్తు అరెస్టు చేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని విమర్శించారు. భారత రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సమాజంలోని ప్రతి వ్యక్తికి నిరసన తెలిపే స్వేచ్ఛను కల్పిస్తే, ఆ స్వేచ్ఛా హక్కును కాంగ్రెస్ ప్రభుత్వం కాలరాస్తుందని మండిపడ్డారు.
అసెంబ్లీలో ఎమ్మెల్యేలు మాట్లాడడానికి స్వేచ్ఛ లేదు, నిరసన తెలిపే స్వేచ్ఛ లేదు ఇదేనా ప్రజా పాలన అంటే అని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని హెచ్చరించారు. అరెస్ట్ అయిన వారిలో మాజీ వార్డు సభ్యులు జింకల రామక్రిష్ణ, యూత్ నాయకులు మార్ల సాయి, మైనారిటీ నాయకులు ఎండీ ఫయాజ్, సోషల్ మీడియా కన్వీనర్లు ఎండీ జమాల్, బాసాని ప్రశాంత్ నేత, టింకు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.