– రహీంఖాన్‌గూడ గ్రామ సర్పంచ్ నవ్వ శృతి అరవింద్ వినూత్న నిర్ణయం
బీబీనగర్, జనవరి 22 : బీబీనగర్ మండలంలోని రహీంఖాన్‌గూడ గ్రామంలో ఆడపిల్లల భవిష్యత్‌కు గ్రామ సర్పంచ్ నవ్వ శృతి అరవింద్ తనవంతు భరోసా ఇచ్చారు. ఇటీవల జన్మించిన ఓ ఆడబిడ్డకు తన సొంత నిధుల నుంచి రూ.5,000 నగదు సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాను మహిళా సర్పంచ్‌గా ఎన్నికైన శుభ సందర్భాన్ని పురస్కరించుకుని, తన పదవీకాలం మొత్తం గ్రామంలో జన్మించే ప్రతి ఆడబిడ్డకు రూ.5,000 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తానని ప్రకటించారు. ఇటీవల పక్క గ్రామమైన పడమటి సోమవారం గ్రామంలో జన్మించిన పసిపాపను వదిలివేసిన ఘటన సామాజిక మాధ్యమాల్లో చూసి మనసు చలించిందని తెలిపారు. తాను కూడా ఒక ఆడబిడ్డేనని, ఆడపిల్లను భారం అనుకునే ఆలోచనలు ఈ ఆధునిక యుగంలోనూ కొనసాగడం బాధాకరమన్నారు.
గ్రామంలో మహిళలను అన్ని రంగాల్లో ముందుండేలా చేయడమే తన ముఖ్య లక్ష్యమని తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నా ఈ ఆధునిక యుగంలో కూడా ఆడ, మగ అనే భేదాభిప్రాయాలు ఇంకా కొనసాగడం దురదృష్టకరమన్నారు. ఈ కార్యక్రమంలో బీబీనగర్ మండల సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు మంచాల రవికుమార్, గ్రామ ఉప సర్పంచ్ మంచాల ప్రభాకర్, మాజీ సర్పంచ్ గన్నెబోయిన సత్యనారాయణ గౌడ్, వార్డు సభ్యులు మంచాల కుమార్, ఎలిమినేటి శంకర్ రెడ్డి, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు పంజాల రామారావు గౌడ్, మాజీ ఉప సర్పంచ్ రాపాక జంగయ్య యాదవ్, నాయకుతు కునోజు నరసింహచారి, నోముల రాంరెడ్డి, మంచాల నరహరి, పంజాల గణేష్, పబ్బాల బాల్‌రాజ్, మారబోయిన జంగయ్య పాల్గొన్నారు.