Sundar Pichai : టెక్ దిగ్గజ కంపెనీ గూగుల్ సీఈవోగా ఉన్న సుందర్ పిచాయ్ వేతనం భారీగా పెరిగింది. ఆయన వేతనాన్ని మూడేళ్ల కాలానికిగాను రూ.6,361 కోట్లు (692 మిలియన్ డాలర్లు)గా నిర్ణయిస్తూ గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రపంచంలోనే అత్యధిక వేతనం అందుకుంటున్న సీఈవోల్లో ఒకరిగా సుందర్ పిచాయ్ నిలిచారు. 692 మిలియన్ డాలర్లలో 126 మిలియన్ డాలర్లు పర్ఫామెన్స్ స్టాక్ యూనిట్స్ (పీఎస్‌యూ)గా అందుతాయి. ఇవి రెండు భాగాలుగా చెల్లిస్తారు.
అందులోనూ ఆల్ఫాబెట్ షేర్ హోల్డర్లకు సంబంధించి టార్గెట్ రీచ్ అయితే, సుందర్ పిచాయ్‌కు అందే విలువ డబుల్ అవుతుంది. అంటే 126 మిలియన్ డాలర్ల షేర్ల విలువ 252 మిలియన్ డాలర్లకు చేరుకుంటుంది. మరో 2 మిలియన్ డాలర్లు వార్షిక వేతనం కింద అందగా, స్టాక్ వెస్టింగ్ ద్వారా మూడేళ్లపాటు 84 మిలియన్ డాలర్లు అందుకుంటారు. అలాగే 350 మిలియన్ల వరకు స్టాక్ ఇన్సెంటివ్స్ అందుతాయి. అలాగే కంపెనీకి చెందిన వెయిమో స్టాక్స్ ద్వారా 130 మిలియన్ డాలర్లు, వింగ్ ఏవియేషన్ షేర్ల ద్వారా 45 మిలియన్ డాలర్లు దక్కుతాయి. వీటిలో టార్గెట్ వాల్యూని షేర్లు మించిపోతే 200 శాతం షేర్లు పెరుగుతాయి. ఎన్నో సమస్యల్ని అధిగమించి కంపెనీని అగ్రభాగాన నిలబెడుతున్న సుందర్ పిచాయ్ నాయకత్వంపై ఆల్ఫాబెట్ కంపెనీ విశ్వాసంతో ఉంది.
భారతీయుడైన సుందర్ పిచాయ్ 2004లో గూగుల్‌లో చేరి క్రోమ్ బ్రౌజర్ డెవలప్మెంట్లో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత ఆండ్రాయిడ్ అభివృద్ధిలోనూ పాలుపంచుకున్నారు. సుందర్ పిచాయ్ సాధించిన విజయాల్ని గుర్తించిన కంపెనీ 2015 ఆగష్టులో ఆయనను గూగుల్ సీఈవోగా నియమించింది. దశాబ్దానికిపైగా ఆయన ఈ బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు. ఈ పదేళ్ల కాలంలో కంపెనీ విలువను ఏడు రెట్లు పెంచారు. 535 బిలియన్ డాలర్ల నుంచి ఇప్పుడు 3.6 ట్రిలియన్ డాలర్ల కంపెనీగా ఎదిగింది గూగుల్. ఇక మైక్రోసాఫ్ట్ సీఈవోగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సత్య నాదేళ్ల 2025 ఆర్థిక సంవత్సరంలో 96.5 మిలియన్ డాలర్ల వేతనం అందుకున్నారు.