Ranveer Singh | రణ్వీర్ సింగ్ కథానాయకుడిగా, ఆదిత్య ధర్ దర్శకత్వంలో రూపొందుతున్న హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్ 2: ది రివెంజ్’ చిత్రానికి సంబంధించిన తాజా అప్డేట్స్ సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. తాజాగా విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ పవర్ఫుల్ యాక్షన్ సీక్వెన్స్‌లతో ప్రేక్షకులను కట్టిపడేస్తుండగా, చిత్ర బృందం ప్రేక్షకులకు ఒక అదిరిపోయే తీపి కబురు అందించింది. మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా కోసం, ఒక రోజు ముందే అంటే మార్చి 18వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచే భారీస్థాయిలో పెయిడ్ ప్రీమియర్స్ నిర్వహించాలని నిర్మాతలు నిర్ణయించారు.
ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ ప్రీమియర్స్ విషయంలో మేకర్స్ ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వంటి భారీ చిత్రం నుంచి పోటీ ఉన్న నేపథ్యంలో, సామాన్య ప్రేక్షకులకు భారం కాకూడదనే ఉద్దేశంతో టికెట్ ధరల పెంపు లేకుండానే ఈ ప్రీమియర్స్ ప్రదర్శించబోతున్నారు. రణ్వీర్ సింగ్‌తో పాటు సంజయ్ దత్, ఆర్. మాధవన్, అక్షయ్ ఖన్నా వంటి దిగ్గజ నటులు నటిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
మరోవైపు, ఈ సినిమా నిడివి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దాదాపు 3 గంటల 40 నిమిషాల నుంచి 3 గంటల 55 నిమిషాల వరకు ఉండబోతున్న ఈ చిత్రం, బాలీవుడ్ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘమైన సినిమాల్లో ఒకటిగా నిలవనుంది. ఇంత భారీ రన్‌టైమ్ ఉన్నప్పటికీ, కంటెంట్‌లో దమ్ముంటే ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని, బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.