– పే అప్గ్రేడేషన్, PRP చెల్లింపులపై సీఎండీకి సీఎంఓఏఐ అభ్యర్థన
రుద్రంపూర్, మార్చి 07 : సింగరేణి సంస్థలో పనిచేస్తున్న ఎగ్జిక్యూటివ్ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని సింగరేణి ఎగ్జిక్యూటివ్ల సంఘం సీఎంఓఏఐ (CMOAI) కొత్తగూడెం ఏరియా అధ్యక్షుడు, వి కే ఓ సి ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎం.వి.నరసింహారావు, జనరల్ సెక్రెటరీ ఉపేందర్ బాబు సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బుద్ధ ప్రకాష్ జ్యోతిని కోరారు. శనివారం సింగరేణి కొత్తగూడెం ఏరియా వెంకటేష్ ఖని ఓపెన్ కాస్ట్ లో బొగ్గు రవాణాను ప్రారంభించడానికి వచ్చిన సీఎండీని వారు కలిసి ఈ మేరకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కోల్ ఇండియా లిమిటెడ్ (CIL) లో పనిచేస్తున్న ఎగ్జిక్యూటివ్లకు సమానంగా సింగరేణి ఎగ్జిక్యూటివ్లకు కూడా పే అప్గ్రేడేషన్ అమలు చేయాలన్నారు. అలాగే 2022–23, 2023–24 సంవత్సరాలకు సంబంధించిన పెర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే (PRP) ను తక్షణమే చెల్లించాలని కోరారు.
అదేవిధంగా సింగరేణి సంస్థలో పని చేస్తున్న సుమారు 2,300 మంది ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులకు ఉచిత విద్యుత్, IIT/IIM ఫీజు రీయింబర్స్మెంట్ వంటి ప్రయోజనాలను NCWA ఉద్యోగులకు ఇచ్చినట్లే వర్తింపజేయాలన్నారు. సెల్ఫోన్ రీయింబర్స్మెంట్, TA–DA నిబంధనల్లో సవరణలు వంటి ఇతర ప్రయోజనాలు కూడా కోల్ ఇండియా స్థాయిలోనే సింగరేణి ఎగ్జిక్యూటివ్లకు అమలు చేయాలన్నారు. ఇంకా క్రమశిక్షణా చర్యల ప్రక్రియలో పారదర్శకత, సరళమైన విధానాలను అమలు చేయడంతో పాటు చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ప్రమోషన్ సమస్యలను కూడా త్వరితగతిన పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. సింగరేణి ఎగ్జిక్యూటివ్లకు సంబంధించిన ఈ సమస్యలు చాలా కాలంగా పెండింగ్లో ఉన్నాయని, సంస్థ ఉన్నతాధికారులు తక్షణం స్పందించి పరిష్కరించాలని సీఎంఓఏఐ ప్రతినిధులు కోరారు.