రాజాపేట, నవంబర్ 22 : ఆరుగాలం కష్టపడి పంట తీసిన అన్నదాతలు ధాన్యం అమ్ముకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. కొనుగోళ్లకు మిల్లర్లు సవాలక్ష కొర్రీలు పెడుతున్నారు. క్వింటాల్‌కు 5 కిలోల కటింగ్ ఒప్పుకుంటేనే దించుకుంటామని తెగేసి చెబుతున్నారు. రైస్ మిల్లర్ల కొర్రీలను తట్టుకోలేక రైతన్నలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. రైతన్న పండించిన ప్రతి గింజ కొనుగోలు చేయాలని ప్రభుత్వం ప్రకటించినా, రైస్ మిల్లర్ల యాజమాన్యం పట్టించుకోవడం లేదనడానికి నిలువెత్తు నిదర్శనం రాజాపేట మండలంలోని జాల గ్రామానికి చెందిన కొన్యాల రాంరెడ్డి(65 ) వేదన. కొత్తజాలలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రానికి రాంరెడ్డి ధాన్యాన్ని తీసుకువచ్చారు.
ఐకేపీ నిర్వాహకులు తేమ శాతం పరిశీలించి కాంటా వేసి 153 బస్తాలు కాగా ఓ పక్కకు నిల్వ ఉంచారు. కానీ ఆ రైతు ధాన్యం నలుపు రంగు ఉన్నాయని రాజాపేట మల్లికార్జున ఫార్ బాయిల్డ్ రైస్ మిల్ యాజమాన్యం చెప్పింది. రైతు రైస్ మిల్ వద్దకు వస్తే ఒప్పందం కుదిరాకే ధాన్యాన్ని తరలించాలని ఐకేపీ నిర్వాహకులకు తెలిపారు. 153 బస్తాల గాను 13 బస్తాలు తరుగు చేస్తామని రైస్ మిల్ యాజమాన్యం తెలపడంతో కాంటా వేసిన ధాన్యం వారం రోజులుగా ధాన్యం కొనుగోలు కేంద్రంలోనే నిలిచిపోయింది. ఈ విషయాన్ని బాధిత రైతు మండల వ్యవసాయ అధికారి పద్మజా దృష్టికి తీసుకువెళ్లగా ఆమె వెంటనే స్పందించారు. రైస్ మిల్ యాజమాన్యం ముందే ధాన్యం శాంపిల్ పరిశీలించి ధాన్యం నాణ్యతగానే ఉన్నాయని తేల్చి ఎలాంటి తరుగు లేకుండా సేకరించాలని రైస్ మిల్లర్‌ను ఒప్పించారు. రైస్ మిల్లర్లు మళ్లీ అదే కొర్రీలు పెట్టారు. రైతు రాంరెడ్డి ధాన్యం తీసుకురావద్దని రైస్ మిల్ యాజమాన్యం డ్రైవర్ కు ఆదేశాలు ఇచ్చారు. రైతు లారీకి అడ్డుపడి డ్రైవర్ కాళ్లవేళ్లా పడి వేడుకున్న ధాన్యాన్ని మాత్రం తీసుకు వెళ్లలేదు.
మళ్లీ రైతు రాంరెడ్డి వ్యవసాయ అధికారి పద్మజకు తన గోడును మొర పెట్టుకోగా ఆమె విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి ట్రాక్టర్ల ద్వారా రైస్ మిల్కు తరలించేందుకు చర్యలు తీసుకున్నారు. అయినప్పటికీ కూడా తరుగు లేకుండా ధాన్యాన్ని తీసుకునే ప్రసక్తే లేదని రైస్ మిల్ యాజమాన్యం నిలిపివేసింది. దీంతో మండల వ్యవసాయ అధికారి జోక్యంతో ధాన్యాన్ని సేకరించారు. నాణ్యత ప్రమాణాలు ఉన్న ధాన్యం కొనుగోలు చేయాలని మండల అధికారులు చెప్పినా రైస్ మిల్లర్ పెడచెవిన పెట్టి పది రోజులపాటు నానా తిప్పలు పెట్టారని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు బాసటగా నిలిచిన మండల వ్యవసాయ అధికారి పద్మజకు రైతు రాంరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. మీరు ఏ అధికారికి చెప్పుకున్నా పర్వాలేదని, తమకు పలుకుబడి లేకుండానే ఇంత పెద్ద పార్ బాయిల్డ్ రైస్ మిల్ నడిపిస్తున్నామా, ప్రజా ప్రతినిధుల నుండి, ఉన్నతాధికారుల అండదండలు ఉన్నాయని, తమని ఎవ్వరు ఏమీ చేయలేరని రైస్ మిల్ యాజమాన్యం రైతన్నలను దబాయిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎలాంటి తరుగు లేకుండా ధాన్యం సేకరించేలా ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలని మండల రైతన్నలు వేడుకుంటున్నారు.