భువనగిరి కలెక్టరేట్: భారీ వర్షాలు, వరదల కారణంగా రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తీసుకోవాల్సిన చర్యలపై సోమవారం ఆయన డీజీపీ మహేందర్‌రెడ్డి, ఇతర రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో కలిసి జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు, డీసీపీలు, ఇరిగేషన్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు.
ఈ ఏడాది కురిసిన భారీ వర్షాలతో చెరువులు, కుంటలు నిండాయని, గత మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాల వల్ల ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తినష్టం జరుగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. మంగళవారం ప్రభుత్వం సెలవు ప్రకటించినప్పటికీ అధికారులు విధిగా జిల్లా కేంద్రాల్లోనే ఉండి పరిస్థితులను సమీక్షించాలన్నారు. లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధంగా ఉండి అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
గ్రామసర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు, మున్సిపల్ కవిషనర్లు ఎలాంటి నష్టం జరుగకుండా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. చెరువులు, కుంటలు, వాగుల వద్ద చేపలు పట్టడానికి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఎలాంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు పోలీసుశాఖ సన్నద్ధంగా ఉండాలన్నారు. ప్రమాదకర ప్రాంతాలకు ప్రజలను వెళ్లనీయకుండా పోలీస్, రెవెన్యూ యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
అవసరాన్ని బట్టి ట్రాఫిక్ మళ్లించాలని, టెలీకాన్ఫరెన్స్‌లు, వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తూ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించి తగు చర్యలు చేపట్టాలని కోరారు. వీడియో కాన్ఫరెన్స్‌లో రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్‌శర్మ, ఇరిగేషన్‌శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్, అగ్నిమాపకశాఖ డీజీ సంజయ్‌కుమార్‌జైన్, పంచాయతీరాజ్‌శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌సుల్తానియా, వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, కలెక్టర్ పమేలాసత్పతి, డీసీపీ నారాయణరెడ్డి పాల్గొన్నారు.