యాదగిరగుట్ట, మార్చి22 : ధరణిలో తప్పుడు రిపోర్ట్ పంపిస్తే చర్యలు తప్పవని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అధికారులను హెచ్చరించారు. యాదగిరిగుట్ట తాసీల్దార్ కార్యాయాన్ని శనివారం ఆయన ఆకస్మికంగా తనఖీ చేశారు. ఈ సందర్భంగా నాయబ్ తాసీల్దార్, సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్యాలయంలో సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ధరణిపై సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. తాసీల్దార్ కార్యాలయంలో పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. రిజిస్ట్రేషన్‌కి వచ్చిన రైతులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మండల సర్వేయర్ వద్ద సర్వే కోసం ఉన్న అప్లికేషన్లను త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. కోర్ట్ రిజిస్టర్ ని పరిశీలించారు. కుల ధ్రువీకరణ, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ ఇతర సేవలను వెంటనే పరిష్కరించాలని పేర్కొన్నారు.