యాదాద్రి భువనగిరి, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ) : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి మెడికల్ కాలేజీ ఏర్పాటుకు ఎట్టకేలకు అనుమతులు లభించాయి. కళాశాలకు లెటర్ ఆఫ్ పర్మిషన్(ఎల్ఓపీ) ఇవ్వాలని నేషనల్ మెడికల్ కౌన్సిల్(ఎన్ఎంసీ)కు కేంద్రం వైద్యారోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. మంగళవారం లేదా బుధవారం ఎన్ఎంసీ కాలేజీకి ఎల్ఓపీ ఇవ్వనుంది. దీంతో ఈ ఏడాది నుంచే 50 ఎంబీబీఎస్ సీట్లతో కాలేజీ ప్రారంభం కానుంది. ఈ వారంలో మెడికల్ కౌన్సెలింగ్ జరుగనుందని ప్రిన్సిపాల్ రమేశ్‌రెడ్డి తెలిపారు.
యాదాద్రి మెడికల్ కాలేజీకి ఎల్ఓపీపై కొంత కాలంగా సందిగ్ధత నెలకొంది. మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలంటూ నేషనల్ మెడికల్ కమిషన్ అనుమతి ఉండాలి. అయితే మొదటి సారి ఎన్ఎంసీ బృందం స్వయంగా భువనగిరికి విచ్చేసి తనిఖీలు నిర్వహించింది. అవసరమైన నిబంధనలు పాటించలేదని, వసతులు లేవని ఎల్‌ఓపీని నిరాకరించింది. దీంతో ఫ్యాకల్టీ, స్టాఫ్ రిక్రూట్మెంట్, ఇతర సదుపాయాలను సమకూర్చి.. మరోసారి అప్పీల్‌కు వెళ్లారు. అనంతరం ఎన్ఎంసీ అధికారులు వర్చువల్‌గా తనిఖీలు చేపట్టారు. కానీ రెండోసారి కూడా ఎల్‌ఓపీకి ఎన్ఎంసీ నిరాకరించింది. కళాశాల అనుమతిని పునఃపరిశీలించాలని మూడోసారి అప్పీల్‌కు వెళ్లారు. స్వయంగా ఢిల్లీకి వెళ్లి ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని రకాల డాక్యుమెంట్లు మళ్లీ సమర్పించారు. అంతిమంగా ఎల్ఓపీ ఇవ్వాలని కేంద్రం ఎన్ఎంసీకి ఆదేశించడంతో మార్గం సుగమైంది.
వాస్తవానికి యాదాద్రి మెడికల్ కాలేజీలో మొదట వంద సీట్లతో జీఓ ఇచ్చారు. ఆ తర్వాత సరైన సదుపాయాలు లేవని 50 సీట్లకు కుదించారు. అంతే కాకుండా అనుబంధ ఆస్పత్రికి 300 పడకలకు బదులు 220 పడకలకు కుదించారు. అయితే యాదగిరిగుట్టలో ఇంకా కాలేజీ భవన నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. ఈ నేపథ్యంలో భువనగిరిలోని పాత కలెక్టరేట్ భవనంలో మెడికల్ కాలేజీ ప్రారంభించాలని నిర్ణయించారు. ఇప్పటికే భవనాన్ని అద్దెకు తీసుకున్నారు. కళాశాల అవసరానికి అనుగుణంగా కొన్ని మార్పులు చేశారు.
మాజీ సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా నాడు స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి కృషితో యాదగిరిగుట్టకు కళాశాల మంజూరు చేశారు. తిరుపతి తరహాలో గుట్టలో మెడికల్ కాలేజీ ఉండాలని భావించారు. ఇందులో భాగంగా గతేడాది జూన్ 5న యాదగిరిగుట్టకు మెడికల్ కాలేజీని మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాలేజీ నిర్మాణానికి రూ. 183 కోట్లు కేటాయించింది. 433 పోస్టులను కూడా క్రియేట్ చేస్తూ జీఓ రిలీజ్ చేసింది. ఆ తర్వాత శ్రీలక్ష్మీనరసింహస్వామి మెడికల్ కాలేజీగా నామకరణం కూడా చేసింది.