హాలియా/గుర్రంపోడు, ఏప్రిల్ 4 : గుర్రంపోడు, అనుముల మండలాల్లో మంగళవారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది పలుచోట్ల ఇంటి రేకులు ఎగిరిపోయాయి. విద్యుత్ స్తంభాలు, చెట్లు కూలాయి. వరితోపాటు, మామిడి, బత్తాయి తోటలకు నష్టం వాటిల్లింది.
యాదగిరిగుట్ట, ఏప్రిల్4: జిల్లాలోని పలు మండలాల్లో వడగండ్ల వాన పడింది. మంగళవారం సాయంత్రం ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వాన దంచికొట్టింది. యాదగిరిగుట్టలో సుమారు గంటపాటు వడ గండ్లు, ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. యాదగిరిగుట్ట పలు ప్రాంతాల్లో చెట్లు నేల కొరిగాయి. విద్యుత్ తీవ్ర అంతరాయం వాటిల్లిం ది. యాదగిరిగుట్టకు వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బ ందులు ఎదుర్కొన్నారు. వర్షం నిలిచే వరకు వాహనాలు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయం అయ్యాయి.
రాజాపేట : రాజాపేట మండలం పారుపల్లి గ్రామాల్లో ఈదురు గాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. బొందుగులలో వడగండ్ల వానకు వరిపంటకు నష్టం వాటిల్లింది. మొక్కజొన్న పంటలు సైతం నేల కొరిగి రైతులకు అపార నష్టం వాటిల్లింది.
కోళ్ల ఫారాలు నేల మట్టం
ఆత్మకూరు(ఎం): మండల కేంద్రంతో పాటు పారుపల్లి, పోతిరెడ్డిపల్లి, కప్రాయిపల్లి, రహీంఖాన్‌పేట గ్రామాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. పారుపల్లి గ్రామంలో 5గురు రైతులకు చెందిన కోళ్లఫారాలు పూర్తిగా నేల మట్టం కావడం తో పాటు వందల సంఖ్యలో కోళ్లు కూడా మృతి చెందాయి సుమారు రూ.60 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమానులు తెలిపారు. ఈదురుగాలుల సమయంలో కోళ్ల ఫారాల వద్ద ఉన్న రైతు లు ప్రాణభయంతో వణికి పోయారు. గ్రామంలో భారీ వృక్షాలు, విద్యుత్‌స్తంభాలు కూలిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తాసీల్దార్ సూచన మేరకు ఆర్ఐ చిప్పలపల్లి యాదగిరి, పలు గ్రామాల్లో నష్టపోయిన ఆస్తి వివరాలను సేకరించి పంచనామా నిర్వహించారు. నష్టపోయిన కోళ్ల ఫారం యజమానులను ప్రభుత్వం ఆదుకోవాలని పారుపల్లి సర్పంచ్ రమేశ్‌గౌడ్ కోరారు.
మోటకొండూర్ :మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన కురిసింది. ఆయా గ్రా మాల్లో వరి ధాన్యం నేలరాలింది. ఆయా గ్రా మాల్లో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడగా పలు చోట్ల చెట్లు నేలకొరిగాయి.
అడ్డగూడూరు : మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురు గాలుల దాటికి పలు ఇండ్ల రేకులు ఎగిరిపోయాయి. వడగండ్ల వానకు వరిపంట దెబ్బతిన్నది. మామిడి తోటల్లోని కాయలు రాలిపోయాయి. చెట్లు కూలడంతో గట్టుసింగారం గ్రామానికి చెందిన కడారి కిష్టయ్యకు చెందిన 2 మేకలు, శాతపురం భిక్షంకు చెందిన 2 మేకలు మృతి చెందాయి. సూమారు రూ.40 వేల ఆస్తినష్టం జరిగినట్లు బాధితులు తెలిపారు. ఐకేపీ సెంటర్లో వరిధాన్యం పూర్తిగా తగిసి పోయింది.
మోత్కూరు : మండలంలోని పోతాయిగడ్డలోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కూలి పోవడంతో పలు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పట్టణ కేంద్రంలోని మున్సిపల్ కోఆప్షన్ సభ్యురాలు షాహిన్సుల్తానాతో పాటు పలువురి ఇండ్ల పైకప్పులు గాలికి లేచిపోయాయి. మండలంలోని పనకబండ, రాగిబావి, దత్తప్పగూడెం, పాలడుగు, బుజిలాపురం, అనాజిపురం, దాచారం, పొడిచేడు, పాటిమట్ల, మోత్కూరు, కొండగడప గ్రామాల్లో వడగండ్ల వానకు మామిడి తోటల్లో కాయలు రాలిపోయాయి.
హాలియాలో వర్షం
హాలియా : హాలియాలో మంగళవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. ఈదురు గాలులకు ఆరో వార్డులోని ఐస్ ప్యాక్టరీ రేకులు ఎగిరిపోయాయి. లక్ష్మీ గార్డెన్ వద్ద విద్యుత్ స్తంభం కూలగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
గుర్రంపోడులో
గుర్రంపోడు : మండలంలోని పలు గ్రామాల్లో వడగండ్ల వాన కురిసింది. దాంతో వరిపైరు పూర్తిగా దెబ్బతిన్నది. నడికూడలో ఇంటి పైకప్పులు లేచిపోవడంతో పాటు, విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. కొప్పోలులో గోడకూలి మీద పడడంతో బర్రె మృతి చెందింది. ఇంటి పైకప్పు కూలడంతో రుద్రాక్ష లావణ్య చేయి విరిగింది. పిట్టలగూడెంలో డెయిరీ ఫాం పైరేకులు ధ్వంసమయ్యాయి. నల్లగొండ- దేవరకొండ రహదారిపై కట్టవారిగూడెం వద్ద చెట్లు కూలడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. విద్యుత్ స్తంభాలు కూలడంతో పలు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.