దామరచర్ల, జనవరి 3: యాదాద్రి పవర్‌ప్లాంట్ కింద మిగిలి ఉన్న భూములను త్వరలోనే సర్వే చేయిస్తామని జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు అన్నారు. మండలంలోని తిమ్మాపురం గ్రామ శివారులోని యాదాద్రి పవర్‌ప్లాంట్ భూములను మంగళవారం పరిశీలించారు. మండలంలోని నర్సాపురం, తిమ్మాపురం, పడమటితండా, పుట్టలగడ్డ, కల్లేపల్లి గ్రామాల పరిధిలోని శివారులో 190, 99 సర్వేనంబర్‌లో ఉన్న 1232 ఎకరాల అటవీభూమిని గతంలో యాదాద్రి పవర్‌ప్లాంట్ కింద టీఎస్ జెన్కో అటవీశాఖ నుంచి కొనుగోలు చేసింది. ఇందులోని 1080 ఎకరాలను కొన్నేండ్లుగా ఆయా గ్రామాల రైతులు సాగుచేసుకుంటున్నారు.
టీఎస్ జెన్కో భూములను స్వాధీనం చేసుకునేందుకు యత్నిస్తే రైతులు అడ్డుకుంటున్నారు. ఇటీవల యాదాద్రి పవర్‌ప్లాంట్‌కు వచ్చిన సీఎం కేసీఆర్‌కు రైతులు తమ సమస్యను విన్నవించారు. ముఖ్యమంత్రి ఆదేశంతో అదనపు కలెక్టర్ భూములను పరిశీలించి రైతులతో మాట్లాడారు. వారం రోజుల్లో భూములను సర్వే చేసి హద్దులు గుర్తించాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట ఆర్డీఓ చెన్నయ్య, డీఐ బాలాజీనాయక్, తాసీల్దార్ ఖదీర్, ఆర్ఐ సతీశ్ ఉన్నారు.