సూర్యాపేట జిల్లాలో జలకళ
మత్తడి దుంకుతున్నచెరువులు 359..
పూర్తిగా నిండినవి 377
1,071 చెరువుల కింద
70 వేల ఎకరాల ఆయకట్టు
సూర్యాపేట, జూలై 13 : వారం నుంచి కురుస్తున్న వర్షాలతో జిల్లావ్యాప్తంగా వందలాది చెరువులు నిండుకుండల్లా తొణికిసలాడుతున్నాయి. ఇప్పటికే 359 చెరువులు అలుగులు పోస్తుండగా, 377 చెరువులు పూర్తిస్థాయిలో నిండి మత్తడి దుంకేందుకు సిద్ధంగా ఉన్నాయి. జిల్లాలో మొత్తం 1,071 చెరువులు ఉండగా 100 ఎకరాలకుపైగా విస్తీర్ణం ఉన్న వాటిలో 74, వందెకరాల్లోపు చెరువుల్లో 285 అలుగు పారుతున్నాయి. వానలు ఇలాగే మరో 500 చెరువులు ఆ జాబితాలో చేరుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా చెరువుల కింద 70 వేల ఆయకట్టు ఉండగా, ఈ సీజన్లో సాగుకు ఢోకా లేనట్టేనని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
చెరువుల ద్వారా 16 టీఎంసీల నీటి లభ్యత
కాకతీయుల కాలంలో తవ్విన గొలుసుకట్టు చెరువులు జిల్లాలో పెద్ద సంఖ్యలో ఉన్నాయి. నాటి పాలకులు నిర్లక్ష్యం చేయడంతో పూడిపోయి నీటి నిల్వలు తగ్గిపోయాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువుల్లో పూడికలు తీయించి కట్టలు, కాల్వలకు మరమ్మతులు చేయించారు. దాంతో చెరువుల్లో గణనీయంగా నీటి లభ్యత పెరిగింది. సూర్యాపేట జిల్లాలో 1,071 చెరువులు ఉండగా ఇవి పూర్తి స్థాయిలో నిండితే సుమారు 15 టీఎంసీల నీరు ఉంటుంది. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులన్నీ నిండుతున్నాయి. సుమారు 359 చెరువులు మత్తడి దుంకుతున్నాయి. మరో 377 చెరువులు అలుగు పోయడానికి సిద్ధంగా ఉన్నాయి. జిల్లాలో 100 ఎకరాల విస్తీర్ణం కంటే పెద్ద చెరువులు 167 ఉండగా వీటిలో 74 చెరువులు అలుగులు పోస్తున్నాయి. మరో 52 అలుగులు పోయడానికి సిద్ధంగా ఉన్నాయి. 100 ఎకరాల కంటే తక్కువ విస్తీర్ణం ఉన్న చెరువులు 904 ఉండగా వీటిలో 285 చెరువులు అలుగులు పోస్తున్నాయి. మరో 325 చెరువులు పూర్తి స్థాయిలో నిండాయి. ఈ వానకాలం సీజన్లో జూన్‌లో మోస్తరు వర్షాలు పడినా జూలైలో మాత్రం భారీ వర్షాలు కురుస్తున్నాయి. సాధాణంగా జూన్ 1 నుంచి జూలై 12 వరకు 160.7 మిల్లీమీటర్ల వర్షం పడాల్సి ఉండగా 318.7 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జూలైలోనే ఇప్పటి వరకు 214.0 మిల్లీమీటర్ల వర్షం పడింది. దీంతో చెరువుల్లోకి పూర్తి స్థాయిలో నీరు వచ్చి చేరింది. తుంగతుర్తి, సూర్యాపేట నియోజక వర్గాల పరిధిలోని అన్ని చెరువులు నిండాయి. జిల్లాలోని అన్ని చెరువులు, కుంటలతోపాటు వాగులు, చెక్ డ్యామ్‌లు పూర్తిస్థాయిలో నిండితే దాదాపు 16 టీఎంసీల నీరు అందుబాటులో ఉన్నట్లే.
70 వేల ఎకరాల ఆయకట్టు
సూర్యాపేట జిల్లాలో చెరువులు, కుంటలు, వాగులు, చెక్ డ్యామ్‌ల కింద సుమారు 70 వేల ఎకరాల ఆయకట్టు ఉన్నది. గతంలో చెరువులు పూడి పోవడంతో ఆయకట్టు సగానికి తగ్గిపోయింది. మిషన్ కాకతీయ ఫలితంగా నాలుగు సంవత్సరాలుగా జిల్లాలో సుమారు 60 వేల ఎకరాలకు పైగా ఆయకట్టు సాగులోకి వచ్చింది. గత వానకాలం 63 వేల ఎకరాల్లో సాగు చేశారు. ఈ సారి కొంత పెరిగే అవకాశం ఉంది. గోదావరి, కృష్ణా, మూసీ నీటితో జిల్లాలో పంటలు పుష్కలంగా పండుతున్నాయి. ఈ మూడు నదీ జలాల ద్వారా చెరువులను నింపుతున్నారు. ఎండాకాలం కూడా చెరువులు నిండుకుండలా కనిపిస్తున్నాయి.
ఆరు గేట్ల ద్వారా మూసీ నీటి విడుదల
కేతేపల్లి, జూలై 13 : మూసీ ప్రాజెక్ట్ ఆరు గేట్ల ద్వారా బుధవారం నీటి విడుదల కొనసాగింది. 3,282.22 క్యూసెక్కుల నీరు రాగా, ప్రాజెక్ట్ 3, 4, 5, 7, 8, 10వ నంబర్ గేట్లను అడుగు మేర ఎత్తి 3,282.22 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. 53.53 క్యూసెక్కుల నీరు ఆవిరవుతుండగా, 220 క్యూసెక్కుల నీరు సీపేజ్, లీకేజీల ద్వారా దిగువకు వెళ్తుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 645(4.46 టీఎంసీలు) అడుగులు కాగా, ప్రస్తుతం 638.30(2.84 టీఎంసీలు)అడుగులుగా ఉన్నట్లు ఏఈ ఉదయ్‌కుమార్ తెలిపారు.
పులిచింతలకు 1,071 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
చింతలపాలెం, జూలై 13 : పులిచింతల ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 175(45.77 టీఎంసీలు) అడుగులకు గాను బుధవారం సాయంత్రం 6 గంటల సమాచారం మేరకు 167.616(35.0674 టీఎంసీలు)అడుగుల వద్ద నీరు నిల్వ ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి 1,071 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నది. గేట్ల లీకేజీల ద్వారా 400 క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తున్నది.
ఆలేరులో 18.8 మిల్లీ మీటర్ల వాన
జిల్లా వ్యాప్తంగా సగటున 11.9 మిల్లీ మీటర్లు
భువనగిరి కలెక్టరేట్, జూలై 13: జిల్లాలో గత ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు జిల్లాలో సగటు వర్షపాతం 11.9 మిల్లీమీటర్లు నమోదైంది. అత్యధికంగా ఆలేరులో 18.8 మిల్లీమీటర్లు, గుండాల, తుర్కపల్లి(ఎం), బొమ్మలరామారం మండలాల్లో 18.6, రాజాపేటలో 17.4, బీబీనగర్‌లో 15.2, మోత్కూరులో 15, యాదగిరిగుట్టలో 10.4, భువనగిరిలో 9.4, భూదాన్‌పోచంపల్లిలో 7.4, రామన్నపేట, ఆత్మకూర్
(ఎం)లో 6.8, వలిగొండలో 6.4, సంస్థాన్‌నారాయణపురంలో 5.4, చౌటుప్పల్‌లో 3 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.
కృష్ణానదిలో లాంచీ ప్రయాణం నిలిపివేత
నందికొండ, జూలై 13 : అల్పపీడనం కారణంగా గాలి అధికంగా వీస్తుండడంతో కృష్ణానదిలో లాంచీల ప్రయాణాన్ని నిలిపివేశారు. తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో నడుపుతున్న లాంచీలు హిల్‌కాలనీలోని స్టేషన్‌కే పరిమితమయ్యాయి. గాలి ఒత్తిడి తగ్గినంక లాంచీలను యథావిధిగా జాలీ ట్రిప్పులు, నాగార్జునకొండకు నడుపుతామని లాంచీ స్టేషన్ అధికారులు తెలిపారు.