Farmers Protest | ధాన్యం కొనుగోలు ప్రక్రియలో తీవ్ర జాప్యంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని నమిలే గ్రామ రైతులు శనివారం ఉదయం రాస్తారోకో నిర్వహించారు. కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి ధాన్యం నిల్వ ఉండిపోవడం, తూకం ప్రక్రియ ఆలస్యం కావడం, తరుగు పేరుతో ఇబ్బందులు పెట్టడం వంటి సమస్యలపై రైతులు నిరసన వ్యక్తం చేశారు.
ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో రైతులు నమిలే క్రాస్ రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని, కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. రైతుల నినాదాలతో ప్రాంతం మారుమోగింది.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. పంటను విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి వారాల తరబడి ఎదురుచూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షాల భయంతో రాత్రింబవళ్లు ధాన్యం కుప్పల వద్దే కాపలా కాస్తున్నామని తెలిపారు. వర్షం కురిస్తే ధాన్యం తడిసి నాణ్యత దెబ్బతిని భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు.
కొనుగోలు కేంద్రాల్లో సరిపడా సిబ్బంది లేకపోవడం, గన్నీ సంచుల కొరత, రవాణా వాహనాల సమస్యల కారణంగా కొనుగోళ్లు నెమ్మదిగా సాగుతున్నాయని రైతులు ఆరోపించారు. ధాన్యం తూకం వేసిన తర్వాత కూడా మిల్లులకు తరలించడంలో ఆలస్యం జరుగుతోందని, దీంతో కొత్తగా వచ్చే రైతుల ధాన్యం నిల్వ చేసేందుకు స్థలం లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.
రాస్తారోకో కారణంగా కొంతసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని రైతులతో చర్చలు జరిపారు. రైతుల సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు. అయితే హామీలతో సరిపెట్టకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. కొనుగోళ్లు వేగవంతం చేసి, పెండింగ్లో ఉన్న ధాన్యాన్ని వెంటనే తూకం వేసి కొనుగోలు చేయాలని కోరారు. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.