కోదాడ, డిసెంబర్ 25 : యేసు క్రీస్తు ప్రవచనాలతో ప్రపంచ శాంతి వర్ధిల్లుతుందని, ఆయన గొప్ప సంఘ సంస్కర్త అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని కోదాడ పట్టణంలోని సెయింట్ జోసెఫ్ సిసిఆర్ విద్యా నిలయంలో గురువారం నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. విద్యార్థులతో కలిసి కేక్ కట్ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ కేవలం పండుగ మాత్రమే కాదని, ఇది ప్రేమ, శాంతి, ఐకమత్యాన్ని మనకు గుర్తుచేసే రోజన్నారు. ప్రేమతో జీవిస్తూ ఇతరులకు సహాయం చేస్తూ ముందుకు సాగాలని యేసు బోధించారన్నారు. దయ, వినయం, సేవాభావం మన జీవితాల్లో కనిపించాలని సూచించారు.
ద్వేషాన్ని విడిచిపెట్టి శాంతిని పంచాలని, అవసరంలో ఉన్నవారిని ఆదుకోవడం, బాధలో ఉన్నవారిని ఓదార్చడం నిజమైన క్రిస్మస్ సందేశమన్నారు. ఈ క్రిస్మస్ పండుగ మన హృదయాల్లో కొత్త వెలుగును నింపాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు, పీసీసీ డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు, మాజీ డీసీసీబీ చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు, మాజీ సర్పంచ్ ఎర్నేని వెంకటరత్నంబాబు, సుపీరియర్ సిస్టర్ నక్షత్రం, ప్రధానోపాధ్యాయులు జ్యోతి పాల్గొన్నారు.