మాల్, ఫిబ్రవరి 25 : వారం రోజులుగా మిషన్ భగీరథ నీరు రాకపోవడంతో తాగునీటికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం కుర్మేడులో మంగళవారం సాగర్-హైదరాబాద్ రోడ్డుపై ఖాళీ బిందెలతో ధర్నా చేశారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ కుర్మేడులోని పద్మశాలి నగర్ కాలనీకి వారం రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదన్నారు.
తాగునీళ్లు రాక ప్రైవేట్‌లో వాటర్‌ను కొనుగోలు చేసుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. హైవేపై సూమారు గంట సేపు ధర్నా నిర్వహించడంతో పోలీసులు వచ్చి సంబంధిత అధికారులకు సమాచారం అందించారు. ధర్నా స్థలానికి వాటర్ గ్రేడ్ ఏఈ లింగం, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ శేఖర్‌తోపాటు పలువురు అధికారులు వచ్చి మహిళలతో మాట్లాడారు. పైపు లైన్లు లీకేజీ కావడంతో నీళ్లు అందించలేకపోయామని, రెండ్రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.