నల్లగొండ, మార్చి 1: మహిళలు బాగా చదువుకొని పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో ముందుండాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. శనివారం ఆమె జిల్లా కేంద్రంలోని దుర్గాబాయి మహిళా శివు వికాస కేంద్రాన్ని తనిఖీ చేశారు. అక్కడ టైలరింగ్‌లో శిక్షణ పొందుతున్న మహిళలతో మాట్లాడారు. మహిళలు చదువుకుంటే ఏదైనా సాధించగలరని, వయసుతో చదువుకు సంబంధం లేదన్నారు. నేడు పెద్ద కంపెనీలు స్థాపించిన వారు సైతం 50 ఏండ్ల తర్వాతే ఆ పని చేశారని పేర్కొన్నారు. ఇంటి పని చేస్తూ పిల్లలను చూసుకుంటూ టైలరింగ్ చేయడమనేది గొప్ప విషయమని, పనితో పాటు చదువు కూడా కొనసాగించాలని సూచించారు. దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రంలో కుట్టు మిషన్లు సరిపోను లేవని మహిళలు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా త్వరలోనే 30 మిషన్లు ఇస్తానని హామీ ఇచ్చారు. కలెక్టర్ వెంట ఐసీడీఎస్ పీడీ కృష్ణవేణి, హరిత, అనిత ఉన్నారు.
నల్లగొండ : బాలికలు కష్టపడి చదివి సమాజానికి, తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని మైనార్టీ బాలికల గురుకులాన్ని మె తనిఖీ చేశారు. పదో తరగతి విద్యార్థినులతో మాట్లాడి వారి విషయ పరిజ్ఞాన్ని తెలుసుకున్నారు. విద్యార్థులు మంచి పరిజ్ఞానాన్ని సంపాదించేందుకు వార్తా పత్రికలు, పుస్తకాలు చదువాలని అన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ పలు అంశాలపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. అనంతరం వంట గది, డైనింగ్ హాల్, పరిసరాలను పరిశీలించారు. ఆమె వెంట ప్రిన్సిపాల్ షాహీన్ షేక్ ఉన్నారు.
మాడ్గులపల్లి : మండల కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాలకు భవనాలు నిర్మించేందుకు కృషి చేస్తానని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. శనివారం మండల కేంద్రంలో సర్వే నం.257లో తాసీల్దార్, మండల పరిషత్, పోలీస్ స్టేషన్ భవనాల నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని ఆమె పరిశీలించారు. మండల కేంద్రంలో మూడెకరాల ప్రభుత్వ స్థలాన్ని గుర్తించామని, త్వరలో టెండర్లు పిలిచి కార్యాలయాల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ఆమె వెంట సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, తాసీల్దార్ సురేశ్, ఎంపీడీఓ తిరుమలస్వామి, ఆర్ఐ రేణుక ఉన్నారు.