పట్టణాల సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తున్నదని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎంతో వెనుకబడి ఉన్న పట్టణాలు.. నేడు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సారథ్యంలో అభివృద్ధిలో దూసుకుపోతున్నాయని తెలిపారు. పట్టణాలను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసేందుకే సీఎం కేసీఆర్ పట్టణ ప్రగతి చేపట్టారని చెప్పారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం మిర్యాలగూడలో జరిగిన పట్టణ ప్రగతి దినోత్సవంలో స్థానిక ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావుతో కలిసి మండలి చైర్మన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా సంఘాలకు రూ.4.50 కోట్ల రుణ చెక్కులను అందజేశారు.
– మిర్యాలగూడ, జూన్ 16
మిర్యాలగూడ, జూన్ 16 : పల్లెలు, పట్టణాల అభివృద్ధే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని ఏఆర్సీ ఫంక్షన్ హాల్లో తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన పట్టణ ప్రగతి దినోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావుతో కలిసి పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాక ముందు పట్టణాలు అభివృద్ధిలో వెనుకబడ్డాయని, తెలంగాణ వచ్చిన తరువాత తొమ్మిదేండ్ల పాలనలో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సారథ్యంలో పట్టణాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో 67 కొత్త మున్సిపాలిటీలు, ఏడు మున్సిపల్ కార్పొరేషన్లను ఏర్పాటు చేసి కొత్తగా ఏర్పడిన వీటిని అన్ని రంగాల్లో అభివృద్ధిలో ముందుంచిన ఘనత మంత్రి కేటీఆర్‌కే దక్కుతుందన్నారు. దేశంలో 35 ఉత్తమ మున్సిపాలిటీలను గుర్తించగా వాటిలో 19 తెలంగాణలోనే ఉన్నాయని అన్నారు. 2014 తరువాత రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో దూసుకెళ్తుందన్నారు. మిర్యాలగూడ మున్సిపాలిటీ అభివృద్ధికి పురపాలక శాఖ మంత్రి ప్రత్యేక శ్రద్ధతో రూ.200 కోట్ల నిధులు మంజూరు చేశారని, వాటితో పట్టణం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. దేశంలో తలసరి విద్యుత్ వినియోగం 1,200 యూనిట్లు కాగా, తెలంగాణలో 2,300 యూనిట్లకు చేరిందన్నారు. 14ఏండ్లు ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన నాయకుడు కేసీఆర్‌కు ప్రజలు పట్టం కట్టారని, సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం విద్య, వైద్యం, అభివృద్ధి, సంక్షేమంలో ముందుకు దూసుకుపోతుందన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్న సీఎం కేసీఆర్‌కు అన్నివర్గాల ప్రజలు అండగా నిలువాలని కోరారు.
పట్టణ ప్రగతితో దశ మారింది : ఎమ్మెల్యే నల్లమోతు
పట్టణాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని తీసుకొచ్చారని, దాంతో పట్టణాల రూపురేఖలు మారిపోయాయని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు అన్నారు. పట్టణ ప్రగతితో మిర్యాలగూడ పట్టణంలో సీసీ రోడ్లు, పార్కులు, వైకుంఠధామాల నిర్మాణం, విద్య, వైద్య రంగాల్లో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. మిర్యాలగూడ పట్టణంలో ప్రతి నెలా 11,446 మంది పింఛన్‌దారులకు రూ.2.45 కోట్లను అందిస్తున్నట్లు చెప్పారు. పట్టణంలోని రాజీవ్‌చౌక్ నుంచి అద్దంకి-నార్కట్‌పల్లి వై జంక్షన్ వరకు రూ.12 కోట్లతో రోడ్డు విస్తరణ పనులు చేపట్టి ఇరువైపులా డ్రైనేజీలు, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపా రు. అదేవిధంగా సాగర్ రోడ్డును రూ.129 కోట్లతో త్వరలో విస్తరించనున్నట్లు చెప్పారు. షాబునగర్, బాపూజీనగర్‌లో రూ.6.5కోట్లతో ఆధునిక వైకుంఠధామాలు నిర్మిస్తున్నామన్నారు. రూ.14కోట్లతో పందిర్లపల్లి చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా తయారు చేస్తున్నట్లు తెలిపారు. మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, కమిషనర్ రవీందర్‌సాగర్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తిరునగరు నాగలక్ష్మి, కౌన్సిలర్ కుర్ర చైతన్య, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కర్నాటి రమేశ్, అధికారులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.