ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో కులం, మతం, డబ్బు, దస్కం, పైరవీలు, అక్రమాలకు ఆస్కారం లేకుండా ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రతిభకే పెద్దపీట లభిస్తున్నది. అందుకు స్వరాష్ట్రంలో జరిగిన పలు ఉద్యోగాల నియామకాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. ధనిక, పేద అనే తేడా లేకుండా ప్రతిభ కనబర్చిన ఎంతో మందికి తుది ఫలితాల్లో సర్కార్ కొలువు తలుపుతట్టింది. సమైక్య పాలనలో పైరవీకారులు, డబ్బున్నోళ్లకే ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగాలు దక్కేవని నానుడి ఉండే. బీఆర్ఎస్ పాలనలో అలాంటి వాటికి తావు లేకపోవడంతో వివిధ విభాగాల్లో ఎంపికైన ఉద్యోగుల్లో అత్యధికులు సాధారణ కుటుంబాలకు చెందిన యువకులే ఉంటుండం విశేషం. దాంతో ఎవరి జోక్యం లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన కుటుంబాల్లో ఆనందం వెల్ల్లివిరుస్తున్నది.
నల్లగొండ ప్రతినిధి, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ)/ భువనగిరి కలెక్టరేట్ : ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ అనగానే సమైక్య పాలనలో అవకతవకలు, అనుమానాలకు ఆస్కారంగా ఉండేవి. ఉద్యోగాల భర్తీపై అనేక సందేహాలు, అక్రమాల ఆరోపణలు సర్వసాధారణం కావడంతో ప్రతిభ కలిగి వారికి నిరాశే మిగిలేది. కొన్ని కీలకమైన సర్కారు కొలువుల వైపు సాధారణ కుటుంబాలకు చెందినవారు దృష్టి కూడా పెట్టని పరిస్థితి. అంతేకాకుండా ఉద్యోగాల భర్తీపై అప్పటి ప్రభుత్వాలు పెద్దగా దృష్టి కూడా పెట్టలేదు. పైగా అప్పటి జోనల్ సిస్టం ద్వారా తెలంగాణ ఉద్యోగాలన్నీ స్థానికేతరులైన ఆంధ్రా వాళ్లే కొట్టుకుపోయే వారన్నది నిజం. వీటన్నింటి ఫలితంగానే నిధులు, నీళ్లు, నియామకాల పేరుతో కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ ఉద్యమం కొనసాగింది. 14 ఏండ్ల సుదీర్ఘ పోరాటం అనంతరం తెలంగాణ సాధించుకున్నాం. సాధించుకున్న తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కల్పనకు పెద్దపీట వేస్తూ.. వీటిని అత్యంత పారదర్శకంగా నిర్వహించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ అనేక మార్పులకు శ్రీకారం చుట్టారు.
పైరవీలకు ఆస్కారం ఉన్న ఇంటర్వ్యూల వ్యవస్థను అన్ని పరీక్షల్లోనూ తొలగించారు. కొత్త జోనల్ వ్యవస్థకు శ్రీకారం చుట్టి 95 శాతం స్థానికులకే ఉద్యోగాలు కల్పించేలా కీలక చర్యలు చేపట్టారు. దీని ప్రకారమే రాష్ట్రంలో లక్షలాది ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతున్నది. ఓ వైపు టీఎస్పీఎస్సీ ద్వారా గ్రూప్స్‌తోపాటు ఇతర పరీక్షలు నిర్వహిస్తూనే మరోవైపు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా పోలీస్ శాఖలో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. అయితే ఉద్యోగాల భర్తీలో ఎలాంటి అక్రమాలు, పైరవీలకు ఆస్కారం లేకుండా కట్టుదిట్టంగా వ్యవహరిస్తున్నారు. గతంలో ఎస్ఐలు, తాసీల్దార్ల వంటి అధికారుల స్థాయి ఉద్యోగాలు సామాన్యులకు అందని ద్రాక్షగానే ఉండేవి. రాత పరీక్షల్లోనే పైలెటింగ్, ఇతర అక్రమాలు, ఇంటర్వ్యూల సమయంలో డబ్బులకు పెద్దపీట లాంటివి సర్వసాధారణంగా ఉండేవి.
పేద అభ్యర్థుల్లో హైలీ టాలెంటెడ్ వాళ్లలో కొందరికే ఇవి దక్కేవి. ఇక మిగతా ఉద్యోగాలన్నీ దొడ్డిదారిన అక్రమార్కులు దక్కించుకునేవారు. కానీ, నేడు స్వరాష్ట్రంలో వాటికి చెక్ పెడుతూ ఇప్పటికే అనేక ఉద్యోగాలను పారదర్శకంగా భర్తీ చేశారు. ఈ పరీక్షల ఫలితాలను పరిశీలిస్తే అత్యంత సామాన్య కుటుంబాలకు చెందిన యువకులు ఎంతో మంది ఉన్నత ఉద్యోగాలు పొందారు. వీరంతా పరీక్షల నిర్వహణపైనా, ప్రభుత్వ చిత్తశుద్ధిపైనా పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ సర్కారు చిత్తశుద్ధితోనే ఇది సాధ్యమైందని ప్రశంసిస్తున్నారు. కేవలం తమ ప్రతిభ ఆధారంగా తమ చిన్ననాటి కల నెరవేరుతుండడంపై ఆయా కుటుంబాలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలతో తమ జీవితాల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయని స్పష్టం చేస్తున్నారు. దీనంతటికీ స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ పారదర్శక పాలనే కారణమని పేర్కొంటున్నారు.
మాది బోయగూడెం గ్రామం. నాకు ఇద్దరు చెల్లెళ్లు. మా నాన్న వికాలాంగుడు. అయినప్పటికీ మా అమ్మానాన్న కష్టపడి మమ్మల్ని చదివించారు. వారి కష్టానికి తగ్గ ఫలితం దక్కడంతో ఎంతో సంతోషంగా ఉన్నారు. 2019లో తెలంగాణ ప్రభుత్వం జూనియర్ పంచాయతీ కార్యదర్శుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. నేను, నా చెల్లెలు కష్టపడి చదివి ఇద్దరం పంచాయతీ కార్యదర్శులుగా ఎంపికయ్యాం. అనుముల మండలం మదారిగూడెంలో నాకు, నా చెల్లెలు పవిత్రకు పెద్దవూర మండలంలో పోస్టింగ్ వచ్చింది. 2023 ఫిబ్రవరిలో బదిలీలో భాగంగా సొంత మండలానికి రావడం సంతోషంగా ఉంది. చిలకాపురం గ్రామపంచాయతీ సెక్రటరీగా నేను, పెద్దబావితండా సెక్రటరీగా నా చెల్లెలు పని చేస్తున్నాం. ఎలాంటి పైరవీ లేకుండా, రూపాయి లంచం ఇవ్వకుండా ఉద్యోగం రావడం సంతోషంగా ఉంది. గత ప్రభుత్వాల్లో పైరవీలు, లంచాలతోనే ఉద్యోగాలు వచ్చేవి. కానీ, స్వరాష్ట్రంలో వాటికి తావు లేదు అనేందుకు మేమే నిదర్శనం. ప్రస్తుతం మమ్మల్ని పూర్తిస్థాయి కార్యదర్శులుగా గుర్తించినందుకు ప్రభుత్వానికి రుణపడి ఉంటాం.
-చిలకాపురం గ్రామపంచాయతీ సెక్రటరీ, తిరుమలగిరి(సాగర్)
2014లో స్వరాష్ట్రంలో టీఎస్పీఎస్సీ ద్వారా నేను వీఆర్ఏ ఉద్యోగం సాధించాను. నాకు వివాహమైనా నా భర్త నన్ను ఎంతో ప్రోత్సహించాడు. దాంతో కష్టపడి చదివాను. మంచి మార్కులు సాధించి వీఆర్ఏ ఉద్యోగం పొందాను. స్వరాష్ట్రంలో ఉద్యోగం పొందడం నాకు ఎంతో గర్వంగా ఉంది. కొన్నేండ్లపాటు తుంగతుర్తి తాసీల్దార్ కార్యాలయంలో పని చేశాను. ప్రస్తుతం తిరుమలగిరి తాసీల్దార్ కార్యాలయంలో పని చేస్తున్నాను. స్వరాష్ట్రంలో ఉద్యోగాలు కల్పించిన తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు.
-బత్తుల ధనమ్మ వీఆర్ఏ, తుంగతుర్తి
మాది సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వు. మధ్యతరగతి కుటుంబం. ప్రస్తుతం నేను వైజాగ్‌లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాను. గతంలో నేను పోలీస్ ఉద్యోగానికి దరఖాస్తు చేసినా ఫలితం దక్కలేదు. ఇటీవల ప్రభుత్వం మళ్లీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయడంతో తిరిగి దరఖాస్తు చేసుకున్నా. డ్యూటీ చేస్తూనే చదువుకునే వాడిని. ఉదయం పూట వ్యాయామానికి కేటాయించాను. ఎట్టకేలకు రెండోసారి విజయం సాధించి సివిల్ కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాను. త్వరలో ట్రైనింగ్‌కు వెళ్లాల్సి ఉంది. ఎలాంటి పైరవీలు, లంచాలకు తావివ్వకుండా నిష్పక్షపాతంగా ఉద్యోగం సాధించినందుకు గర్వంగా ఉంది. యువతకు ఉద్యోగాలు కల్పించిన రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు.
-కూరపాటి వెంకటేశ్వర్రావు, సివిల్ కానిస్టేబుల్, మేళ్లచెర్వు
నాపేరు నూకపంగు పవన్‌కుమార్. మాది మిర్యాలగూడ మండలం గూడురు గ్రామం. మాది నిరుపేద కుటుంబం. తల్లిదండ్రులు పిచ్చయ్య, అంజమ్మ వ్యవసాయ కూలీలు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా నేను చిన్నతనం నుంచే ప్రభుత్వ పాఠశాలలోనే చదివాను. చదువులో నాకున్న అసక్తితో ఎంఏ, బీఎడ్ పూర్తిచేశాను. ఒకవైపు ఖాళీ సమయంలో పెయింటింగ్ పనికి వెళ్తూ, మరోవైపు చదువును కొనసాగించాను. పోలీస్ కావాలనేది నా కోరిక. అలాగే నా తల్లిదండ్రులను మంచిగా చూసుకోవాలని అనుకున్నాను. అది నేడు తెలంగాణ రాష్ట్రంలో సాకారమైంది. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన 2022 నోటిఫికేషన్లో పోలీస్ కానిస్టేబుల్ (సివిల్) ఉద్యోగాన్ని సాధించాను. సమైక్య పాలనలో పైరవీ చేయడంతోపాటు డబ్బున్న వారికే కొలువులు వచ్చేవి. కానీ, స్వరాష్ట్రంలో దళారీ వ్యవస్థకు తావులేకుండా కష్టపడి చదివిన వారికే కొలువులు వస్తున్నాయి. కేసీఆర్ ప్రభుత్వంలో పైరవీలు పూర్తిగా బంద్ అయ్యాయి. యువకులమంతా ఉద్యోగాలు సాధించి కలలను సాకారం చేసుకుంటున్నాం.
-నూకపంగు పవన్‌కుమార్, కానిస్టేబుల్, గూడూరు, మిర్యాలగూడ
మాది మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెం. నిరుపేద గిరిజన కుటుంబం. గ్రామంలో ఎకరన్నర పొలం ఉంది. అమ్మ, నాన్నలు మాలావత్ పీక్లీ, తులసీరాం మాకున్న పొలం చేస్తూనే కూలి పనికి వెళ్తారు. నాకు చిన్నప్పటి నుంచి ప్రభుత్వ కొలువు చేయాలనే కోరిక ఉండేది. మా అమ్మానాన్నలు కూలి పనికి వెళ్లగా వచ్చిన డబ్బులతో నన్ను చదివించిండ్రు. ఈ క్రమంలో నాన్న అనారోగ్యంతో చనిపోయిండు. అమ్మ పట్టదలతో నన్ను చదివించింది. మిర్యాలగూడలో ప్రాథమిక విద్యతోపాటు ఇంటర్ చదివి పాలిసెట్ రాసి అర్హత పొందాను. 2011-13లో కంపసాగర్‌లో అగ్రికల్చర్ పాలిటెక్నిక్ చేశాను. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 2016లో టీఎస్పీఎస్సీ ద్వారా పరీక్ష రాసి అర్హత సాధించాను. ప్రభుత్వం నాకు ఏఈఓ పోస్టు ఇచ్చింది. దామరచర్ల మండలం కొండ్రపోల్ క్లస్టర్లో ఏఈఓగా విధులు నిర్వహిస్తున్నా. జాబ్‌కోసం పైసా ఖర్చు పెట్టలేదు. రికమండేషన్ లేదు. స్వరాష్ట్రం ఏర్పాటుతోనే నాకు జాబ్ వచ్చింది. మా చెల్లి పెండ్లి చేశాను. మా అమ్మను నా దగ్గరే ఉంచుకొని మంచిగా చూసుకుటున్నా.
– రావుల రమేశ్, ఏఈఓ, కొండ్రపోల్, దామరచర్ల
మేము యాదవ కులస్తులం. మాకు ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. నా భార్య కూలికి పోతే నేను గొర్లు కాస్తూ ఇద్దరి అమ్మాయిల పెండ్లిళ్లు చేశాం. మా కుమారుడు నరేశ్‌ను బీటెక్ వరకు చదివించాం. ఇటీవల పోలీస్ పరీక్ష రాయగా ఎలాంటి పైరవీ లేకుండా, పైస ఇవ్వకుండానే మా కొడుకు బెటాలియన్ పోలీస్‌గా ఎంపికయ్యాడు. మా అబ్బాయికి ఉద్యోగం రావడంతో ఎంతో సంతోషంగా ఉంది. ఉద్యోగావకాశం కల్పించిన తెలంగాణ ప్రభుత్వానికి రుణపడి ఉంటాం.
-చిలుకల పెద్దులు యాదమ్మ, బుడమర్లపల్లి
మాది రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేద కుటుంబం. మాకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. మా బిడ్డ దేవమణి చిన్నప్పటి నుంచే చదువులో బాగా రాణించేది. కూలి పనులు చేస్తూ కూతురును ఉన్నత చదువులు చదివించాం. మా కష్టం వృథా చేయొద్దనే లక్ష్యంతో కష్టపడి చదివేది. ఈ క్రమంలో తెలంగాణ సర్కారు పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. ఎలాంటి పైరవీ లేకుండా సొంత ప్రతిభతో పంచాయతీ కార్యదర్శి ఉద్యోగం సాధించి మా కలను సాకారం చేసింది. తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వడంతోనే మా కూతురు ఉద్యోగం సాధించగలిగింది. మా కుటుంబ సభ్యులమంతా ప్రభుత్వానికి రుణపడి ఉంటాం.
-ఇంజ ముత్తయ్య, కాల్వపల్లి, రాజాపేట
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల ఎంపిక అత్యంత పారదర్శకంగా, మెరిట్ ఆధారంగా ఎంపిక జరిగింది. టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో ఎలాంటి అక్రమాలు చోటుచేసుకోలేదని నమ్ముతున్నా. నాకు పరీక్షలో వచ్చిన మార్కుల ప్రకారం పంచాయతీ కార్యదర్శి ఉద్యోగం వచ్చింది. కష్టపడి చదివినందుకు ఫలితం దక్కింది. పేదరికంతో ఇబ్బంది పడుతూ తన రెక్కల కష్టంతో నన్ను చదివించిన మా అమ్మ నాకు ఉద్యోగం రావడంతో చాలా సంతోషపడింది. నిరుద్యోగులు ఉద్యోగాల ఎంపికలో అసత్యాలు, అపోహలను నమ్మొద్దు. ఏకాగ్రతతో కష్టపడి చదివితే తప్పకుండా ఉద్యోగం సాధించవచ్చు.
-గంగధారి రామకృష్ణ, పంచాయతీ కార్యదర్శి, మల్లేపల్లి, వలిగొండ
రామకృష్ణ చిన్నతనంలోనే నా భర్త అనారోగ్యంతో కాలం చేసిండు. ఆయన మరణంతో నేను దిక్కుతోచని స్థితికి చేరాను. పేదరికంతో ఏమి చేయాలో అర్థమయ్యేది కాదు. కొద్దికొద్దిగా వచ్చిన కుట్టు మిషన్నే నమ్ముకున్నా. అదే జీవనాధారం అయ్యింది. రామకృష్ణ చదువులో చురుకుగా ఉండడంతో ఎంత కష్టమొచ్చినా చదివించాలనుకున్నా. ఇంజినీరింగ్ పూర్తి చేయించాను. ఈ క్రమంలో పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ వచ్చింది. దానికి దరఖాస్తు చేసి పరీక్ష రాయగా ఉద్యోగం వచ్చింది. నా బిడ్డకు ఉద్యోగం రావడం సంతోషంగా ఉంది. ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ ఇచ్చిన ప్రభుత్వానికి ధన్యవాదాలు.
-గంగధారి పద్మ, రామకృష్ణ తల్లి, వలిగొండ
మాది నిరుపేద కుటుంబం. నేను గ్రామపంచాయతీ కార్మికుడిగా పని చేస్తూ నా బిడ్డను చదివించా. తెలంగాణ ప్రభుత్వం లో నా బిడ్డ వనపర్తి అఖిలకు కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది. ఇటీవల ప్రకటించిన ఫలితాల్లో కానిస్టేబుల్‌గా ఎంపికైంది. ఎలాంటి పైరవీ లేకుండానే ఉద్యోగం సాధించడం ఆనందంగా ఉంది. పారదర్శకంగా, పైరవీలకు తావులేకుండా ఉద్యోగాల ఎంపిక చేసిన ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం.
-వనపర్తి వెంకన్న, రామలింగాలగూడెం