చండూరు, నవంబర్ 26:దళారుల చేతుల్లో పత్తి మిల్లులు ఉండటం తో రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను విక్రయించేందుకు నానా అవస్థలు పడుతున్నారు. చండూరు మండల పరిధిలోని మంజిత్ జిన్నింగ్ మిల్లులో విచిత్రమైన పరిస్థితి నెలకొని ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దళారులు మిల్లుకు తెచ్చిన పత్తిని ఎలాంటి వంకలు పెట్టకుండా కొనుగోలు చేస్తున్నారని, రైతులు తెచ్చిన పత్తికి నానా వంకలు పెడుతూ బాగోలేదంటూ, కొనుగోలు చేయకుండా తిరిగి పంపుతున్నారంటూ రైతులు బుధవారం మిల్లు ఎదుట రోడ్డుపై బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ దేశానికి అన్నంపెట్టే రైతన్నలు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి తంటాలు పడాల్సి వస్తోందని అన్నారు. నాణ్యత, తేమ పేరుతో సీసీఐ కేంద్రాల్లో పత్తిని కోనుగోలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే పత్తిని తాము దళారులకు విక్రయించిన తర్వాత, దళారులు ఆ పత్తిని మిల్లులకు తెస్తే ఎలాంటి కొర్రీలు పెట్టకుండా తీసుకుంటున్నారని అన్నారు. తాము తెచ్చినప్పుడు మంచిగా లేని పత్తి, దళారులు తెచ్చినప్పుడు ఎలా మంచిగా ఉంటోందని రైతులు ప్రశ్నిస్తున్నారు.
మంగళవారం కపాస్ కిసాన్ యాప్లో స్లాట్ బుక్ చేసుకొని తీసుకొస్తే నాణ్యత ప్రమాణాల పేరుతో 10 మంది రైతుల పత్తి కొనుగోలు చేయకుండా నిలిపివేశారు. అలాగే బుధవారం కూడా రైతులు తెచ్చిన పత్తిలోని తేమను అధికారులు పరిశీలించక పోవడంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు పడిగాపులు కాయవల్సివచ్చిందన్నారు. స్లాట్ బుక్ చేసిన రోజే పత్తి కొనుగోలు చేయాలని లేకుంటే రైతులపై ఆర్ధిక భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళన విషయం పోలీసులు, అధికారులకు తెలియడంతో వారు వచ్చి మిల్లర్లతో మాట్లాడిన తర్వాత ఆందోళనను విరమింపజేశారు. వాతావరణం కారణంగా పత్తి ఎర్రబారినా, నాణ్యత లేని పత్తిని అధికారులే తక్కువ ధరకు కొనుగోలు చేసి రైతులను దళారుల బారినుంచి కాపాడాలని కోరుతున్నారు.