నల్లగొండ సిటీ, అక్టోబర్ 04 : బీఆర్ఎస్ పార్టీ పోటీ చేసిన అన్ని జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాలను గెలుచుకుని పార్టీ అధినేత కేసీఆర్‌కు కానుకగా ఇవ్వాలని నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శనివారం నల్లగొండలోని కేబీఆర్ క్యాంప్ కార్యాలయంలో కనగల్ మండల జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచుల ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో కనగల్ మండలంలో 24 గ్రామ పంచాయతీలు, 9 ఎంపీటీసీ స్థానాలను గెలుచుకుని, ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాన్ని సైతం కైవసం చేసుకున్నట్లు తెలిపారు. తిరిగి అదే స్ఫూర్తితో పార్టీ అభ్యర్థులుగా ప్రకటించిన వారి గెలుపు కోసం కష్టపడి పని చేయాలని కోరారు. పార్టీ కార్యకర్తల కోసం తాను ఎంతవరకైనా పోరాడడానికి సిద్ధమన్నారు. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా, పార్టీకి నమ్మకంగా పనిచేసే వ్యక్తులను, సాధ్యమైనంత వరకు యువకులను అభ్యర్థులుగా ఎంపిక చేసుకోవాలని సూచించారు.
రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ సత్తయ్య గౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. అందుకే ఎన్నికలను వాయిదా వేస్తూ వచ్చిందని, తప్పని పరిస్థితుల్లో కోర్టు ఆదేశాలతో ఎన్నికలు ప్రకటించినప్పటికీ, ఎన్నికలు వాయిదా పడాలనే ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్లు తెలిపారు. అందుకే ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేసి మన జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచులను గెలిపించుకున్నట్లయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఇది పెద్ద మార్పు కాబోతదన్నారు.
ఈ సమావేశంలో కనగల్ సింగిల్ విండో చైర్మన్ వంగాల సహదేవరెడ్డి, మాజీ ఎంపీపీ కరీం పాషా, సీనియర్ నాయకులు గోన రవీందర్రావు, మండలాధ్యక్షుడు అయితగోని యాదయ్య, మాజీ వైస్ ఎంపీపీ రామగిరి శ్రీధర్ రావు, మండల కార్యదర్శి జొన్నలగడ్డ శేఖర్ రెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కడారి కృష్ణయ్య, హనుమంతు నాయక్, ఎర్రబెల్లి నర్సిరెడ్డి, మహిళా అధ్యక్షురాలు రేణుక, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, మాజీ ఉపసర్పంచ్ లు, గ్రామ శాఖ అధ్యక్షులు, పార్టీ కమిటీల సభ్యులు, ముఖ్య కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.