యాదగిరిగుట్ట, జూలై 26 : గత బీఆర్ఎస్ ప్రభుత్వం బడ్జెట్లో ఎక్సైజ్ శాఖకు రూ. 18,470 కోట్లు కేటాయిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సారి రూ.25,617 కోట్లు కేటాయించిందని, గతంతో పోలిస్తే రూ. 7,147 కోట్లు పెంచి ప్రజలను తాగుబోతులను చేస్తారా..? అని టెస్కాబ్ మాజీ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి అన్నారు. బెల్ట్ షాపులు బంద్ చేయిస్తామని, మద్యం దుకాణాలను తగ్గిస్తామని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి గల్లీకో బెల్ట్ షాపులను పెడుతారా..? ప్రశ్నించారు.
యాదగిరిగుట్ట పట్టణంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్ ఏ వర్గానికీ మేలు చేసే విధంగా లేదన్నారు. గ్రామాల్లో విచ్చలవిడిగా మద్యం పంపిణి చేసి ప్రజలకు తాగుబోతులను చేసే పనిలో కాంగ్రెస్ ఉందని ధ్వజమెత్తారు. గంధమల్ల జలాశయాన్ని నిర్మిస్తామని, తపాసుపల్లి జలాశయం ద్వారా ఆలేరు నియోజకవర్గానికి సాగునీళ్లందిస్తామని ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చిన కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు నియోజకవర్గ ప్రజలకు ఇప్పుడేం సమాధానం చెబుతారో వివరించాలని తెలిపారు.
రాష్ట్ర తొలి సీఎం కేసీఆర్ నృసింహసాగర్ జలాశయం నిర్మాణానికి ప్రత్యేక నిధులు కేటాయించి 95 శాతం పనులను పూర్తి చేశారన్నారు. కానీ బడ్జెట్లో సీఎం రేవంత్‌రెడ్డి నృసింహసాగర్, గంధమల్ల, తపాసుపల్లి జలాశయాల ఊసెత్తలేదని మండిపడ్డారు. కేవలం అంకెల గారడి తప్పితే ప్రజలకు లాభం లేదని ఆరోపించారు. సస్యశ్యామలంగా మారబోయే జిల్లాను ఏడారిగా మార్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధపడిందని విమర్శించారు.
ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి బడ్జెట్లో ఆ ఊసే ఎత్తలేదని చెప్పారు. రైతు భరోసా, కౌలు రైతులు, కూలీలు, మహిళలకు ఆర్థిక సాయం, ఆసరా పింఛన్ రూ. 2 వేల నుంచి రూ. 4 వేల పెంపు వంటి పథకాలను మరిచారని తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్ రూ. 1200 కోట్ల ప్రభుత్వ ఖజానాతో యాదగిరిగుట్ట దేవస్థానాన్ని అద్భుతంగా పునర్నిర్మించారని చెప్పారు. 99 శాతం పనులు పూర్తికాగా ఒక శాతం పనులు మిగిలి ఉన్నాయన్నారు.
కానీ బడ్జెట్లో యాదగిరిగుట్ట దేవస్థానానికి ఒక్క రూపాయి కూడా కేటాయించక తీవ్ర అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ సీఎం కేసీఆర్ పదేండ్లలో రూ.50 వేల కోట్లు అప్పుజేశారని ఆరోపిస్తున్న రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ సర్కారు మాత్రం కేవలం 7 నెలల్లోనే రూ.34 వేల కోట్ల అప్పు తెచ్చిన్నట్లు చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేలు జిల్లాలో ఏమొహం పెట్టుకుని తిరుగుతారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు, రైతులు కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ యాదగిరి గుట్ట మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య, పీఏసీఎస్ చైర్మన్ ఇమ్మడి రామిరెడ్డి, పట్టణ సెకట్రరీ జనరల్ పాపట్ల నరహరి, జిల్లా నాయకులు వంటేరు సురేశ్‌రెడ్డి, పట్టణ నాయకుడు గంజి సూర్యనారాయణ నేత పాల్గొన్నారు.