యాదాద్రి భువనగిరి జిల్లాకు మంజూరైన మెడికల్ కాలేజీ ఈ విద్యా సంవత్సరం ప్రారంభమవుతుందా..? వచ్చే కౌన్సెలింగ్లో జాబితాలో మన కాలేజీ ఉంటుందా..? అనేది స్పష్టత రావడంలేదు. ఈ ఏడాది కాలేజీ ప్రారంభంపై సందిగ్ధత నెలకొంది. మెడికల్ కాలేజీకి అనుమతి రాకపోవడంతో ఏర్పాటుపై నీలినీడలు కమ్ముకున్నాయి. అధికారులు మాత్రం అప్పీలుకు వెళ్లినట్లు చెబుతున్నారు. ఇక ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాత్రం కాలేజీ అంశాన్ని పట్టంచుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
గత బీఆర్ఎస్ సర్కారు తెలంగాణ వ్యాప్తంగా పెద్దఎత్తున మెడికల్ కాలేజీలను నెలకొల్పింది. ఇందులో భాగంగా యాదగిరి గుట్టకు గతేడాది జూన్ 5న అప్పటి ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కళాశాల తరగతులు ప్రారంభం అవుతాయని జీఓలో పేర్కొన్నారు. ఇక కాలేజీ నిర్మాణానికి రూ.183 కోట్లు కేటాయిస్తూ పరిపాలనా అనుమతుల కోసం సెప్టెంబర్ 16న జీఓ నంబర్ 162 విడుదల చేశారు.
అదే రోజు 433 పోస్టులను క్రియేట్ చేస్తూ జీఓ నంబర్ 124 రిలీజ్ చేశారు. ఇందులో అనుబంధ ఆస్పత్రి డీఎంఈ పరిధిలోకి వస్తుందని పేర్కొన్నారు. ఆ తర్వాత శ్రీలక్ష్మీనరసింహ స్వామి మెడికల్ కాలేజీగా నామకరణం కూడా చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిపై దృష్టి పెట్టకపోవడంతో వంద నుంచి 50 ఎంబీబీఎస్ సీట్లకు కుదించారు. పాత కలెక్టరేట్ భవనంలో మెడికల్ కాలేజీ ప్రారంభానికి ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి. అందుకు అనుగుణంగా మరమ్మతులు కూడా చేయించారు.
అనుమతి నిరాకరణ..
తెలంగాణలో 8 మెడికల్ కళాశాలల ఏర్పాటుకు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) అనుమతి నిరాకరించింది. అవసరమైన నిబంధనలు పాటించలేదని, వసతులు లేవని పర్మిషన్ ఇవ్వలేదు. ఇందులో యాదాద్రి మెడికల్ కాలేజీ కూడా ఉన్నది. నిబంధనల ప్రకారం 50 ఎంబీబీఎస్ సీట్లతో కాలేజీ ఏర్పాటు కావాలంటే 14మంది ప్రొఫెసర్లు, 20మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 25మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉండాలి. సుమారు 60మంది టీచింగ్ స్టాఫ్ ఉండాలి. అయితే ఈ మెడికల్ కాలేజీలో ఈ నిబంధనలు పాటించలేదు. ఎన్ఎంసీ టీమ్ తనిఖీలకు వచ్చినప్పుడు సరైన సదుపాయాలు, స్టాఫ్ లేనట్లు గుర్తించారు. దీంతో కళాశాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వలేదు.
అప్పీలుకు అధికారులు
ఎన్ఎంసీ లేవనెత్తిన లోపాలను 60 రోజుల్లో సవరించుకునే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో మెడికల్ కాలేజీ అనుమతి కోసం అధికారులు అప్పీలుకు వెళ్లారు. కళాశాల అనుమతిని పునఃపరిశీలించాలని ఎన్ఎంసీని కోరారు. గతంలో ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ పూర్తి కాలేదని, ప్రస్తుతం ఈ సమస్య సమసిపోయిందని అధికారులు చెబుతున్నారు. ఈ సారి అనుమతి వచ్చే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ఎన్ఎంసీ అనుమతి ఇస్తుందో లేదో వేచి చూడాల్సిందే.
పట్టించుకోని ప్రభుత్వ విప్ బీర్ల..!
ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మెడికల్ కాలేజీ విషయాన్ని సీరియస్గా తీసుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాలేజీ యాదగిరిగుట్టకు మంజూరైంది. అక్కడే ఏర్పాటుకు అన్ని అనుమతులు కూడా ఉన్నాయి. తాత్కాలికంగా గుట్టలోనే ఏర్పాటు చేయకుండా.. భువనగిరిలోని పాత కలెక్టరేట్లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గుట్టకు మంజూరైతే భువనగిరిలో ఎలా ఏర్పాటు చేస్తారనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. గుట్టలో పాలిటెక్నిక్ కాలేజీకి సంబంధించి రెండు బిల్డింగ్లు కూడా ఖాళీగా ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. అప్పుడు దానిని పట్టించుకోలేదని, ఇప్పుడు ఎన్ఎంసీ అనుమతి నిరాకరించిన దానిపై కూడా ఫోకస్ పెట్టడలేదని విమర్శలు వెల్లవెత్తుతున్నాయి. కేవలం రాజకీయాలకే పరిమితమవుతున్నారనే ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి.
ప్రభుత్వ చేతగాని తనం వల్లే..
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో యాదగిరిగుట్టకు మెడికల్ కాలేజీని మంజూరు చేయించాం. అప్పట్లోనే అన్ని అనుమతులు మంజూరయ్యాయి. ఈ విద్యాసంవత్సరం నుంచి తరగతులు ప్రారంభం కావాలి. కానీ కనీసం ప్రారంభానికి ఏర్పాట్లు కూడా చేయకపోవడం విడ్డూరంగా ఉంది. ప్రభుత్వం చేతగాని తనం వల్లే అనుమతి నిరాకణ జరిగింది. కేసీఆర్ అభివృద్ధి ఆనవాళ్లు తుడిచేసే కుట్ర జరుగుతున్నది. రాజకీయాలకు ఇచ్చే ప్రాధాన్యత పాలనకు ఇవ్వడం లేదు.
– గొంగిడి సునీతామహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, ఆలేరు