తుంగతుర్తి, ఫిబ్రవరి 7 : కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను ప్రజలు గమనిస్తున్నారని, కృష్ణా ప్రాజెక్టుల నిర్వహణను కేఆర్ఎంబీకి అప్పగించడం ఆ పార్టీ నాయకుల చేతగానితనమని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలోతుంగతుర్తిలో బీఆర్ఎస్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ అధికారంలోకి వచ్చి రెండు నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ పనితీరు బయటపడిందన్నారు. సాగునీటి విషయంలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పందించకపోవడం జిల్లా ప్రజలకు అన్యాయం చేసినట్లేనని తెలిపారు. రైతు బంధు పడడం లేదని అడిగిన వారిని చెప్పుతో కొడుతానని మంత్రి కోమటిరెడ్డి అనడం ఆయన అహంకారానికి నిదర్శనమన్నారు. జడ్పీ చైర్మన్ సందీప్‌రెడ్డిపై మంత్రి పోలీసులతో దౌర్జన్యం చేయించడం సరి కాదని చెప్పారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కార్యకర్తలు, నాయకులు కష్టపడితే ఎంపీ సీట్లు బీఆర్ఎస్వేనని తెలిపారు.
కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు దుర్మార్గం ; మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్
గడిచిన పదేండ్ల కాలంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేద ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమలు చేశారని మాజీ ఎమ్మెల్యే కిశోర్ అన్నారు. కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు సీఎం రేవంత్‌రెడ్డికి తగదని హెచ్చరించారు. ఎన్నికల ముందు రెండు లక్షల రుణ మాఫీ చేస్తామని చెప్పి నేటి వరకు చేయని దద్దమ్మ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అని విమర్శించారు. రానున్న ఎంపీ,ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగురవేయాలని, అందుకు గులాబీ సైన్యం సిద్ధంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్లు గుజ్జ దీపికాయుగంధర్‌రావు, ఎలిమినేటి సందీప్‌రెడ్డి, నాయకులు ఒంటెద్దు నరసింహారెడ్డి, బీఆర్ఎస్ యాదాద్రి జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, రైతుబంధు సూర్యాపేట జిల్లా మాజీ అధ్యక్షుడు రజాక్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తాటికొండ సీతయ్య, జడ్పీటీసీ దావుల వీరప్రసాద్‌యాదవ్, ఎంపీపీ గుండగాని కవితారాములుగౌడ్, డీసీసీబీ డైరెక్టర్ గుడిపాటి సైదులు, వైస్ ఎంపీపీ శ్రీశైలంయాదవ్, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు, మాజీ సర్పంచ్‌లు, సోషల్ మీడియా సభ్యులు పాల్గొన్నారు.