మునుగోడు, జూన్ 19 : అర్హులైన ప్రతి పేదవానికి పార్టీలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తామని మనుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి తెలిపారు. గురువారం మునుగోడు మండలం పలివెల గ్రామంలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో సీసీ రోడ్లతో పాటు, డ్రైనేజీలు చేపట్టాల్సిన ప్రాంతాలను, ఇళ్లపై నుండి వెళ్తున్న విద్యుత్ తీగలను పరిశీలించారు. పలివెల నుండి ఊకొండి వెళ్లే రహదారిని, పలివెల నుండి చీకటిమామిడి వెళ్లే రహదారిని పరిశీలించారు.
గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ఫర్నిచర్, లైట్లు, ఫ్యాన్లు అంశాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా ఫర్నిచర్ ఇప్పించే బాధ్యత తనదన్నారు. కాగా సామాజిక బాధ్యతతో లైట్లు, ఫ్యాన్లు ఉపాధ్యాయులే సమకూర్చుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ పదో తరగతిలో మంచి మార్కులు తెచ్చుకుంటున్న విద్యార్థులకు తమ తల్లి సుశీలమ్మ ఫౌండేషన్ పేరు మీద ప్రోత్సహించి మెమెంటోలు అందజేస్తామని తెలిపారు.
అర్హులైన ప్రతి పేదవానికి ఇందిరమ్మ ఇల్లు ఇప్పించే బాధ్యత తనదన్నారు. పలివెల గ్రామంలో డ్రైనేజీ సిస్టంను శాస్త్రీయంగా నిర్మించాల్సిన అవసరం ఉందని, దానికోసం ప్రణాళికలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గృహాల పైన ఉన్న విద్యుత్ తీగలను వెంటనే తొలగించి, గృహాల మధ్యలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ను తరలించాలని విద్యుత్ అధికారులకు సూచించారు. అలాగే గ్రామంలో కొత్తగా ఎంతమందికి పింఛన్లు రావాలో జాబితాను సిద్ధం చేయాలని ఎంపీడీఓను ఆదేశించారు. పర్యటనలో ఎమ్మెల్యే వెంట ఎంపీడీఓ, ఎంపీఓ, విద్యుత్ ఏఈ, గ్రామ కార్యదర్శి, పలివెల కాంగ్రెస్ ముఖ్య నాయకులు, మునుగోడు మండల ముఖ్య నాయకులు ఉన్నారు.