– బీఆర్ఎస్ నాయకులు
దామరచర్ల, జూన్ 12 : ప్రాణాలకు తెగించైనా యాదాద్రి పవర్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకుని కాపాడుకుంటామని బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. కేసీఆర్ కలల ప్లాంట్ అయిన వైటీపీఎస్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ శుక్రవారం ప్లాంట్ ముందు బీఆర్ఎస్ నాయకులు, స్థానికులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదాద్రి పవర్ ప్లాంట్ ను నడిపించే సత్తా లేక కమీషన్లకు కక్కుర్తి పడి ప్లాంట్ను కాంట్రాక్టర్లకు అప్పచెప్పడం సిగ్గుచేటు అన్నారు. పవర్ ప్లాంట్ ఏర్పాటు సమయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్, జగదీశ్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు దామరచర్ల మండల ప్రాంతంలో పవర్ ప్లాంట్ ఏర్పాటుకు అన్ని గ్రామాల ప్రజలు సహకరించడం జరిగిందని, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం పవర్ ప్లాంట్ కింద నష్టపోయిన నిర్వాసితులకు తగిన న్యాయం చేయకుండా ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయడం వల్ల ప్రభావిత గ్రామాల ప్రజలు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
కేవలం ఉద్యోగుల కొరతను కారణంగా చూపుతూ ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గమైన చర్య అన్నారు. ప్లాంట్ కింద నష్టపోయిన భూ నిర్వాసితులు, ఎంక్రోచర్స్ తో పాటుగా స్థానికులకు పూర్తిస్థాయిలో ఉద్యోగాలు కల్పించినట్లయితే ఉద్యోగుల కొరత ఉండదన్నారు, ప్లాంట్లో స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించకుండా ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. యాదాద్రి పవర్ ప్లాంట్ లో ప్రస్తుతం నాలుగు యూనిట్లు ప్రారంభమై 3,200 మెగావాట్ల విద్యుత్ రాష్ట్రానికి అందిస్తున్నదని అందుకు కావాల్సిన ఉద్యోగ నియామకాలు మాత్రం జరపడం లేదన్నారు. ప్లాంట్ ను ప్రైవేటీకరిస్తే స్థానికులు, ఉద్యోగులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందన్నారు.
ప్రభుత్వం ఇప్పటికైనా ప్రైవేటీకరణను నిలిపివేయాలన్నారు. లేకుంటే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానికులతో కలిపి ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. ప్రాణాలకు తెగించైనా పవర్ ప్లాంట్ ప్రైవేటికరణను అడ్డుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కె.వీరకోటిరెడ్డి, ఎండీ.యూసుఫ్, సోమ సైదిరెడ్డి, కొనకంచి సత్యనారాయణ, రాయికింది సైదులు, వినోద్, కొండారపూ నాగేశ్వరరావు, కొండారపు శ్రీనివాస్, బంగారు సైదిరెడ్డి, బైరం గోపి పాల్గొన్నారు.