సూర్యాపేట టౌన్, నవంబర్ 13 : వేధింపులకు, దాడులకు గురవుతున్న బాలలకు, మహిళలకు నైతికపరమైన, సామాజిక పరమైన భద్రత, బరోసా, ధైర్యం కల్పించడమే జిల్లా షీ టీమ్స్, పోలీస్ భరోసా సెంటర్స్ లక్ష్యమని ఎస్పీ నరసింహ తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని పోలీస్ మహిళా భరోసా సెంటర్, జిల్లా షీ టీమ్స్ కార్యాలయాలను ఆయన సందర్శించి రికార్డ్స్ ను పరిశీలించి మాట్లాడారు. మహిళలు, పిల్లల రక్షణ చట్టాలు, శిక్షల అమలు గురించి ప్రజలకు వివరించాలని భరోసా సెంటర్, షీ టీమ్స్ సిబ్బందిని ఆదేశించారు. మహిళల, పిల్లల రక్షణ పట్ల తీసుకుంటున్న చర్యలు, కౌన్సిలింగ్ నిర్వహణ, అవగాహన కార్యక్రమాల నిర్వహణను పరిశీలించి సిబ్బందికి సలహాలు, సూచనలు చేశారు. వేదింపులు, అత్యాచారం, నిరాదరణకు గురైన బాధిత మహిళలకు, పిల్లలకు ఒకేచోట న్యాయ, వైద్య పరమైన సదుపాయాలు, సామాజిక, నైతిక భద్రత, మానసిక ధైర్యం లభిస్తుందన్నారు.
అవసరమైన వారికి చదువుతో పాటు అన్ని సౌకర్యాలు ఒకేచోట కల్పిస్తూ, బాధితులకు మనోధైర్యం కల్పించే విధంగా రాష్ట్ర పోలీస్, మహిళా అండ్ చెల్డ్ వెల్ఫేర్ అధ్వర్యంలో జిల్లా భరోసా సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మహిళలలు వేధింపులపై ధైర్యంగా ఫిర్యాధు చేయాలన్నారు. మహిళలు, బాలల రక్షణ చట్టాలు బలోపేతం చేయబడ్డాయని, ఎవరైనా వేధింపులు, లైంగిక దాడులకు పాల్పడితే జైలు శిక్షలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. పిల్లలపై లైంగిక దాడుల్లో పోక్సో చట్టం కేసుల్లో జీవిత కాలం శిక్షలు పడుతున్నాయని తెలిపారు. సాంకేతికత ఆధారాలతో నాణ్యమైన దర్యాప్తును చేస్తున్నామని, ఫాస్ట్ ట్రాక్ లో నేరాల్లో త్వరగా శిక్షలు అమలైయ్యేలా పోలీసు శాఖ పని చేస్తున్నదన్నారు. దాడులకు, వేదింపులకు గురౌతున్న బాలల, మహిళల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలన్నారు.
బాధితులకు సామాజిక అభద్రతా భావం ఏర్పడకుండా ధైర్యం కల్పించడంతో పాటు ఎప్పటికప్పుడు న్యాయ సహాయం అందించడం, మానసిక దైర్యం కల్పించాలని సిబ్బందికి సూచించారు. జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థల్లో, పట్టణాలు, కాలనీల్లో భద్రతా చట్టాల అమలు గురించి, పోలీసు శాఖ తీసుకుంటున్న చర్యల గురించి, అపరిచిత వ్యక్తుల ప్రవర్తన, గుడ్ టచ్ – బ్యాడ్ టచ్ ల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. రద్దీ ప్రాంతాల్లో ఆకతాయిలపై నిఘా ఉంచాలన్నారు. విద్యా సంస్థల్లో కమిటీలు ఏర్పాటు చేయాలని, ఎలాంటి సమస్య వచ్చినా, వేధింపులు జరిగిన సమాచారం వచ్చేలా నెట్ వర్క్ ఏర్పాటు చేసుకోవాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో భరోసా సెంటర్ మహిళా ఏఎస్ఐ సైదావి, భరోసా సెంటర్, షీ టీమ్స్ సిబ్బంది పాల్గొన్నారు.