– కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
కోదాడ, జూలై 16 : కోదాడ పట్టణంలోని ప్రతి వార్డులో అర్హులైన ఓట్లు గల్లంతు కాకుండా అప్రమత్తంగా ఉండాలని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పార్టీ శ్రేణులకు సూచించారు. గురువారం తన నివాసంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై బూత్ లెవల్ ఏజెంట్లు, పట్టణ ముఖ్య నాయకులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి బూత్ పరిధిలో ఇంటింటిని సందర్శించి ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి అర్హులైన ప్రతి ఓటరుకు సర్ ఫారాలను నింపటంలో సహకరించాలన్నారు. బీఎల్ఓ లను సమన్వయం చేసుకుంటూ తప్పులు దొర్లకుండా ఫారాలు నింపాలన్నారు. ఇందుకు బాధ్యులు బూత్ లెవల్ ఏజెంట్లేనన్నారు. ఆయా వార్డులలో బాధ్యులు పర్యవేక్షణ చేస్తూ నిరక్షరాస్యుల ఓటర్ల వివరాలను సర్ ఫారాలలో సజావుగా నింపేందుకు సమాయత్తం కావాలన్నారు. ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షుడు ఎస్కే నయీమ్, సీనియర్ నాయకులు పైడిమర్రి సత్యంబాబు, తుమ్మలపల్లి భాస్కర్, గొర్రె రాజేష్, భాగ్యమ్మ, అబ్బు, మజార్, చలిగంటి వెంకట్, ఉపేందర్ గౌడ్ పాల్గొన్నారు.