– లేబర్ కోడ్లు రద్దు చేయాలి
– ఏఐటీయూసీ నల్లగొండ ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి
మునుగోడు, జూలై 10 : కేంద్ర పాలకులు కార్మిక వ్యతిరేక విధానాలు ఆవలంభించడం వల్ల మారిన కార్మిక చట్టాల నేపథ్యంలో శ్రమ దోపిడీ పెరుగుతుందని ఏఐటీయూసీ నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం మునుగోడులో జరిగిన ఏఐటీయూసీ మండల 11వ మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పాలక వర్గాలు కార్పొరేట్ శక్తులకు తొత్తుగా మారాయన్నారు. అనేక దశాబ్దాల పాటు పోరాడి సాధించుకున్న హక్కులు ఇప్పుడు కనుమరుగై మోదీ సర్కార్ కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయని ఆయన ఆరోపించారు. ఎన్డీఏ పాలనలో కార్మిక హక్కులు హరించబడుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సంఘటిత, అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు తమ హక్కుల కోసం పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. పాలకులు యాజమాన్యాల సంక్షేమాన్ని చూస్తున్నారని, యాజమాన్యాలకు వేల కోట్ల రాయితీలు ప్రకటిస్తున్నా ప్రభుత్వాలు కార్మికుల గురించి ఆలోచించడం లేదన్నారు. పాలకులు అవలంబిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని, హమాలీ కార్మికులకు సమగ్ర చట్టం రూపొందించాలని ఆయన కోరారు.
రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గురిజ.రామచంద్రం, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బొలుగురి నరసింహ, ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి టి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ వ్యవస్థను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. గత ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వం కార్మిక వర్గానికి ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నారు. ఈ నెల 19వ తేదీన నల్లగొండ జిల్లా ఏఐటీయూసీ మహాసభ గుర్రంపొడ్ లో జరుగుతుందని, సభకు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ మహాసభకు దుబ్బ వెంకన్న అధ్యక్షత వహించగా ఏఐటీయూసీ మండల గౌరవాధ్యక్షుడు చాపల శ్రీను. మండల అధ్యక్షుడు దుబ్బ వెంకన్న, కార్యదర్శి బెల్లం శివయ్య, మండల నాయకులు విరిగి లింగస్వామి, ఈద రాములు, బొల్లు సైదులు, గొడ్డటి శ్రీశైలం. కె.మల్లేశం, చందపాక యాదయ్య, చిరంజీవి. వి.ముత్తయ్య. వీరమల్ల అంజయ్య, ఇదే రాములు, తోటకూరి మారేష్, పందుల చిన్న నరసింహ, భీమనపల్లి స్వామి పాల్గొన్నారు.

‘శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమించాలి’