– కాంగ్రెస్ హయాంలో వెక్కిరిస్తున్న శిలాఫలకాలు
– 100 పడకల దవఖాన బీఆర్ఎస్ హయాంలోనే
– కోదాడ అభివృద్ధిపై ఎప్పుడైనా చర్చకు సిద్ధం
– మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
కోదాడ, ఫిబ్రవరి 06 : అవినీతి, అబద్ధాలు, ఆర్భాటం కలగలిపితే అది ఉత్తమ్‌కుమార్ రెడ్డి అని, రెండు సంవత్సరాల కాలంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ, నిధుల మంజూరు కోట్లలో చూపిస్తూ ఆచరణలో మాత్రం అభివృద్ధి పనులు ఒక్క అడుగు ముందుకు వేయలేదని, ఆయనవన్నీ ఉత్తర ప్రగల్బాలేనని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. శుక్రవారం కోదాడలోని తన నివాసంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. కోదాడ నియోజకవర్గాన్ని కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశారని చెప్పుకోవడమే తప్ప ఆచరణలో శంకుస్థాపనలకే పరిమితమని స్పష్టం చేశారు. అందుకు కోదాడ నియోజకవర్గంలోని శిలాఫలకాలే సాక్షిభూతాలన్నారు. శంకుస్థాపనలు చేసి ఒకటిన్నర సంవత్సరాలు అవుతున్నప్పటికీ తట్టెడు మట్టి పోయలేదని ఇప్పటికే ప్రజలు అర్థం చేసుకున్నారన్నారు. కోదాడ వంద పడకల ఆస్పత్రి బీఆర్ఎస్ హయాంలోనే మంజూరు అయిందని, ఈ అంశంపై అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసిన విషయాన్ని గుర్తు చేస్తూ జీఓ కాపీని చూపించారు. ఉత్తమ్ వి ప్రగల్బాలే అనడానికి ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలన్నారు.
తాను ఎమ్మెల్యేగా కోట్లాది రూపాయల నిధులను రప్పించి కోదాడ పట్టణంతో పాటు నియోజకవర్గంలో అభివృద్ధి చేసిన విషయాన్ని ఆయన ఆధారాలతో గుర్తు చేశారు. సెంట్రల్ లైటింగ్ సిస్టం. ఉత్తమ్ పద్మావతి కాలనీలోని మౌలిక వసతులు, పార్కు ప్రధాన రహదారుల నిర్మాణం తదితర అభివృద్ధి పనులు జరిగిన విషయాన్ని తెలిపారు. బస్టాండ్ అభివృద్ధికి రూ.17.90 కోట్లు మంజూరు చేసినా నిధులు కాగితానికే పరిమితం అని ఆ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారన్నారు. రెండు నియోజకవర్గాల్లో చేపట్టిన ఎత్తిపోతల పథకాలు ఒక్కటి కూడా ఉపయోగంలోకి రాలేదని విమర్శించారు. తమ పార్టీ హయాంలోనే లేఔట్ స్థలాలను మున్సిపాలిటీకి అప్పగించామని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన కార్యకర్తలను గాలికి వదిలేసి మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థిని ఖరారు చేసేందుకు రూ.10 లక్షలు డిపాజిట్ చేయించారన్నారు. అభివృద్ధి పేరుతో మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు అడగలేక డబ్బు సంచులతో పాటు బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థులను అర్ధరాత్రి ఆయన తాబేదారు ఫోన్లో బెదిరించడం ఏమిటన్నారు. ఎదురెడ్డి పోరాడలేకనే ఈ చిల్లర పనులు చేస్తున్నారన్నారు. తమ కౌన్సిలర్ అభ్యర్థులను బెదిరిస్తే ఇక సహించేది లేదని, అవసరమైతే ప్రత్యక్ష దాడులకు దిగుతామని ఇప్పటికైనా చిల్లర రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ఆయన పట్టణ ప్రజలను కోరారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నయీమ్, మాజీ అధ్యక్షుడు కుకడపు బాబు, శెట్టి సురేష్ పాల్గొన్నారు.