నల్లగొండ ప్రతినిధి, ఆగస్టు 2(నమస్తే తెలంగాణ) : ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని సాగునీటి ప్రాజెక్టులన్నింటిని వచ్చే మూడేండ్లలో పూర్తి చేస్తామని రాష్ట్ర మంత్రులు నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రకటించారు. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల పూర్తికి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. శుక్రవారం నాగార్జునసాగర్ నుంచి ఎడమకాల్వ ఆయకట్టు, లోలెవల్ కెనాల్‌కు ఆర్అండ్బీ మంత్రి కోమటిరెడ్డితో కలిసి భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ సాగునీటిని విడుదల చేశారు. పెద్దవూర మండలం పొట్టిచెల్మ వద్ద ఎడమకాల్వ హెడ్ రెగ్యులేటర్ వద్ద ప్రత్యేక పూజలు చేసి కృష్ణమ్మకు సారెను సమర్పించారు.
అనంతరం స్విచ్ ఆన్ చేసి కాల్వలోకి నీటిని వదిలారు. అనంతరం లోలెవల్ కెనాల్ పంపుహౌస్ వద్దకు చేరుకుని పూజల అనంతరం సాగునీటిని కాల్వలోకి వదిలారు. ఎడమ కాల్వకు 10 వేల నుంచి 11వేల క్యూసెక్కుల నీటిని, లో లెవల్ కెనాల్‌కు 400 క్యూసెక్కుల నీటిని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అనంతరం విజయ విహార్‌లో మీడియాతో మంత్రులు మాట్లాడారు. పదేండ్ల కాలంలో నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు ఇంత త్వరగా సాగునీటిని విడుదల చేసిన ఘనత తమదేనని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. పూర్తి సామర్థ్యంతో నీటిని వదులుతూ కాల్వ వెంట ఉన్న చెరువులు, కుంటలు నింపుతూ తాగు, సాగు నీటి అవసరాలను తీర్చనున్నట్లు చెప్పారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేస్తామన్నారు. ముఖ్యంగా ఎస్ఎల్బీసీ సొరంగమార్గం, డిండి ఎత్తిపోతల, బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు, పిల్లాయిపల్లి వంటి పనులకు ప్రాధాన్యమిస్తూ యుద్ధప్రాతిపదికన పూర్తి చేయనున్నట్లు తెలిపారు. కృష్ణా నదిపై నిర్మాణంలో ఉన్న ఎత్తిపోతల పథకాలతోపాటు కొత్తగా ప్రారంభించాల్సిన వాటిని సైతం పూర్తి చేయనున్నట్లు తెలిపారు. గంధమళ్ల రిజర్వాయర్‌ను 1.50టీఎంసీల సామర్ధ్యంతో త్వరలోనే పూర్తి చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రాజెక్టులను మూడేండ్లల్లో పూర్తి చేసి ప్రజల రుణం తీర్చుకుంటామని ప్రకటించారు.
ఏఎమ్మార్పీ కాల్వకు లైనింగ్ పనులు, సొరంగ మార్గాన్ని పూర్తి చేయడంతోపాటు ఏఎమ్మార్పీ కాల్వ లైనింగ్ చేపట్టి సుమారు 4లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరిస్తామన్నారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు. సాగర్ నీటితో ప్రణాళికబద్ధంగా అన్ని చెరువులు, కుంటలను నింపుతామన్నారు. కార్యక్రమంలో మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, ఎమ్మెల్యేలు ఎన్.బాలునాయక్, బత్తుల లక్ష్మారెడ్డి, ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్‌బొజ్జా, ఈఎన్సీ అనిల్‌కుమార్, కలెక్టర్ నారాయణరెడ్డి, సీఈ నాగేశ్వర్రావు, ఎస్పీ శరత్ చంద్రపవార్, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
నాగార్జునసాగర్ ఎడమకాల్వకు నీటి విడుదలపై చెబుతూ మంత్రి ఉత్తమ్ తడబాటుకు గురయ్యారు. పదేండ్ల నుంచి ఇంత తొందరగా సాగర్ నీళ్లు ఎన్నడూ వదలి పెట్టలేదని, పూర్తి కెపాసిటీతో నీళ్లు వదలిపెట్టడం జరుగుతుంది చెప్పుకొచ్చారు. కాగా, 2022లో ఇంతకు ఐదు రోజుల ముందే అప్పటి కేసీఆర్ సర్కార్ సాగునీటిని విడుదల చేసిందనేది సాగర్ ప్రాజెక్టు అధికారుల లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. 2022 జూలై 28న సాగర్ నుంచి ఎడమకాల్వకు, ఏఎమ్మార్పీ, లో లెవల్ కెనాల్‌కు అప్పటి మంత్రి జగదీశ్‌రెడ్డి చేతుల మీదుగా సాగునీటిని విడుదల చేశారు. ఈ విషయాన్ని దాచిపెట్టాలనో, సరైన సమాచారం లేకనో మంత్రి ఉత్తమ్ తామే ఇంత ముందుగా సాగునీటిని విడుదల చేస్తున్నట్లు ప్రకటించడంతో అక్కడ ఉన్న మీడియాతో పాటు అధికారులు విస్మయం వ్యక్తం చేశారు.
సాగర్‌కు వరద ఉధృతి పెరిగిన వెంటనే ఆగస్టులో సాగునీటి విడుదలను సహజంగానే చేస్తుంటారు. అయితే శుక్రవారం ఎడమ కాల్వ నీటి విడుదల కార్యక్రమానికి మాత్రం భారీ హడావిడి చేశారు. ఎప్పుడూ లేనివిధంగా జిల్లాలోని మెజార్టీ పోలీసు అధికారులను, సిబ్బందిని సాగర్‌కు తరలించారు. ముందు ప్రకటించిన విధంగా ఉత్తమ్, కోమటిరెడ్డితోపాటు ఖమ్మం జిల్లా మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు హాజరుకావాల్సి ఉంది. చివరలో పొంగులేటి, తుమ్మల హాజరుకాలేదు. నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రులు మాత్రమే పాల్గొన్నా సాగర్‌లోని విజయవిహార్ నుంచి పొట్టిచెల్మ వరకు 10 కిలోమీటర్ల మేర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఎడమకాల్వ రెగ్యులేటరీ వద్దకు వెళ్లేందుకు మూడు చోట్ల చెక్‌పోస్టులు పెట్టారు. మీడియా ప్రతినిధులను కూడా ఐడీ కార్డులు ఉంటేనే అనుమతించారు. సాధారణంగా ముఖ్యమంత్రి పర్యటనకు మించిన బందోబస్తు చర్యలు, చెకింగ్లు చేపట్టడంతో మంత్రుల ప్రోగామ్కే ఇంత హడావుడి ఎందుకన్న చర్చ వినిపించింది. హెడ్‌రెగ్యులేటరీ వద్ద గతంలో మంత్రి జగదీశ్‌రెడ్డితోపాటు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు నీటిని విడుదల చేస్తున్న సమయంలో మీడియాతోపాటు రైతులు, ప్రజలకు సైతం అనుమతి ఉండేది. ఈసారి రోప్ వేసి ఎవ్వరినీ దగ్గరకు అనుమతించ లేదు. ప్రజా పాలన అంటూ ఎన్నడూ లేనివిధంగా బందోబస్తు, ఎక్కడికక్కడ నిలువరింతలు, చెకింగ్ పెట్టడం ఏంటన్న దానిపై చర్చ సాగింది.
నందికొండ : మంత్రుల పర్యటన సందర్భంగా పోలీసులు భారీగా మోహరించారు. రైతులు, కాంగ్రెస్ నాయకులు, మీడియాను ఎక్కడికక్కడ అడ్డుకుని అత్యుత్సాహం ప్రదర్శించారు. నీటి విడుదల తర్వాత హిల్‌కాలనీ విజయవిహార్‌కు వచ్చిన మంత్రులను కలవడానికి వచ్చిన వారిని విజయవిహార్ ఎంట్రెన్స్ గేటు వద్దే ఆపారు. దాంతో కాంగ్రెస్ నేతలు, రైతులు వాగ్వాదానికి దిగారు. మీడియా ప్రతినిధులు వీడియోలు, ఫొటోలు తీసుకునేందుకు కూడా ఎడమ కాల్వకు ఏర్పాటు చేసిన విద్యుత్ రక్షణ వలయం బయట గోడ పక్కన లారీ పెట్టి దాన్నే మీడియా పాయింట్‌గా చెప్పడం గమనార్హం. కొం దరు విలేకరులు ఫొటో లు తీసే క్రమంలో స్వల్పంగా విద్యుత్ షాక్ తగలడంతోపాటు కెమెరాలు కింద పడిపోయాయి.