చండూరు, జనవరి 01 : చండూరు మండలం తాస్కానిగూడెం గ్రామ సర్పంచ్ కొండ రజితా రవి ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు ఉపక్రమించారు. హామీల అమలులో భాగంగా తన అత్త మామ స్వర్గీయ కొండ సత్తయ్య, అంజమ్మ జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్‌ను గురువారం గ్రామానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త గోన సురేందర్ రావు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అన్ని వర్గాల ప్రజలు నమ్మకంతో తనను గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా గెలిపించారన్నారు. గ్రామ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. పార్టీలకు అతీతంగా గ్రామాభివృద్ధే లక్ష్యంగా ప్రజా సేవలో ముందుకు కొనసాగనున్నట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.