యాదగిరిగుట్ట, నవంబర్10 : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులపై కక్ష సాధింపు చర్యలను మానుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వార్కింగ్ ఇచ్చారు. నిరంతరం పార్టీ శ్రేణులపై రాజకీయ ఒత్తిడి తీసుకొచ్చి, ఆసత్యపు ఆరోపణలతో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. వరంగల్‌లో ప్రైవేట్ కార్యక్రమానికి వెళ్తున్న కేటీఆర్‌ను యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లి బైపాస్ రోడ్డు వద్ద మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, ఎన్డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. బీఆర్ఎస్ యాదగిరి గుట్ట మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్యతోపాటు సుమారు 500 మంది పార్టీ కార్యకర్తలు పాల్గొని జై కేసీఆర్.. జైజై కేటీఆర్… జై జై బీఆర్ఎస్ అంటూ సందడి చేశారు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, సీఎం కాబోయేది కేటీఆరేనని నినాదాలు చేశారు. పార్టీ కార్యకర్తల ఉత్సాహాన్ని చూసి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో మాట్లాడి ఉత్సాహం నింపారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ మలిదశ తెలంగాణ ఉద్యమంలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొని ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించిన బీఆర్ఎస్ నాయకత్వానికి ఇలాంటి ఒడిదుడుకులు కొత్తేమికాదని అన్నారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయలేని దుస్థితిలో ఉండి బీఆర్ఎస్ నాయకత్వంపై అసత్యపు ఆరోపణలు చేస్తూ ప్రజల దృష్టిని మరల్చేందుకు కుట్రలు చేస్తున్నదని మండిపడ్డారు.
ప్రభుత్వ విధానాలను నిరంతరం ప్రజలకు వివరించి, ఎన్నికల హామీలను అమలు చేసే విధంగా ఒత్తిడి తీసుకురావాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో విజయం సాధించి, పార్టీ పూర్వ స్థితిని తీసుకొచ్చేందుకు పాటుపడాలని కోరారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహిస్తే బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.