– కోదాడ ప్రధాన రహదారిపై విశ్రాంత ఉద్యోగుల ర్యాలీ
కోదాడ, మార్చి 16 : అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై చేస్తున్న యుద్ధాన్ని నిరసిస్తూ తెలంగాణ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం కోదాడ యూనిట్ ఆధ్వర్యంలో పెన్షన్ భవన్ నుండి ర్యాలీగా బయల్దేరి “ప్రపంచ శాంతి వర్ధిల్లాలి “”యుద్దోన్మాదం నశించాలని నినాదాలు చేస్తూ ప్రధాన రహదారిపై జడ్పీహెచ్ఎస్, కోదాడ బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం సంఘ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు రావిళ్ల సీతారామయ్య ర్యాలీని ఉద్దేశించి మాట్లాడారు. ప్రపంచమంతా వసుదైక కుటుంబంలా కలిసి ఉన్న ఈ తరుణంలో యుద్ధం వల్ల అనేక రకాల ఇబ్బందులు తలెత్తుతున్నట్లు తెలిపారు. మన దేశంలో పెట్రోల్, వంటగ్యాస్ కొరతతో పాటు నిత్యవసరాల సమస్యలు తలెత్తుతున్నాయని, ఇతర దేశాల్లో ఆహారం కొరత ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
దీంతో పాటు ప్రపంచం దేశాల్లో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, వెంటనే యుద్ధాన్ని నిలిపి శాంతిని నెలకొల్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బొల్లు రాంబాబు, కోదాడ యూనిట్ అధ్యక్షుడు వేనేపల్లి శ్రీనివాసరావు, కార్యదర్శి రఘువర ప్రసాద్, ఆర్థిక కార్యదర్శి తమ్మనబోయిన వీరబాబు, అసోసియేట్ అధ్యక్షుడు వి.జానయ్య, ఉపాధ్యక్షులు గులాం, ఎస్తాని, భ్రమరాంబ, హాజీనాయక్, భూపాల్ రెడ్డి, బాలేమియా, మణి, రామ్, తదితర కార్యవర్గ సభ్యులు, పెన్షనర్లు పాల్గొన్నారు.