చండూరు, మే 14 : పంచాయతీ ఎన్నికల్లో దివ్యాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించకుంటే నల్లగొండ జిల్లా చండూరు నుంచే హస్తం పార్టీని అంతం చేసేలా సమర శంఖం పూరిస్తామని భారత దివ్యాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేశ్ అన్నారు. బుధవారం చండూరు మండల కేంద్రంలో సంఘం మండలాధ్యక్షుడు ఆకారపు వెంకన్న అధ్యక్షతన ఏర్పాటు చేసిన రాజ్యాధికారి సాధన సభకు ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో దివ్యాంగుల పింఛన్లు రూ.6 వేలకు పెంచుతామని, ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని, రాష్ట్రంలో దివ్యాంగుల ఆట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తామని, దివ్యాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా గుర్తించి ప్రత్యేక అధికారులను నియమిస్తామని, దివ్యాంగ బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని, ముఖ్యంగా తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో దివ్యాంగులకు జనాభా దామాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు చెప్పారు. దివ్యాంగుల ఓట్లను కొల్లగొట్టి ముఖ్యమంత్రిగా గద్దెనెక్కి 16 నెలలు పూర్తి కావస్తున్న దివ్యాంగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీను అమలు చేయకుండా దివ్యాంగ సమాజం పట్ల వివక్ష ప్రదర్శిస్తున్న తీరు బాధాకరమన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే తన తీరు మార్చుకుని అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలన్నారు. లేకుంటే భారత దివ్యాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను ఉదృతం చేయనున్నట్లు హెచ్చరించారు. ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర మహిళా నాయకురాలు గుడిపల్లి సుమతి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొల్లూరు ఈదయ్య బాబు, నల్లగొండ జిల్లా అధ్యక్షుడు చిన్నపాక మత్స్యగిరి, మహిళా నాయకురాలు అలివేలు, సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు గోగుల శేఖర్ రెడ్డి, మునుగోడు మండలాధ్యక్షుడు సహదేవుడు, రమేశ్, షార్వోని, చండూరు మండల మహిళా అధ్యక్షురాలు రేణుక, మండల యూత్ అధ్యక్షుడు శ్రీకాంత్, మండల ఉపాధ్యక్షుడు పి.రవి, మునుగోడు మండల ఉపాధ్యక్షుడు ఒంటెపాక ముత్తయ్య పాల్గొన్నారు.